Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హీరో రాజశేఖర్
కథానాయకుడు డా|| రాజశేఖర్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం హైదరాబాద్లో సినీ ప్రముఖులు, పాత్రికేయ మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఇదే వేడుకలో ఆయన నటించిన 91వ సినిమా 'శేఖర్' చిత్రంలోని అనూప్ రూబెన్స్ బాణీలు సమకూర్చిన 'కిన్నెర ఓ కిన్నెర' అంటూ సాగే పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ, 'కోవిడ్ టైంలో నేను బతుకుతానా లేదా అనిపించింది. ఇక నా జీవితం అయిపోయింది, నేను సినిమాలు చేస్తానా లేదా.. అనుకున్నాను.ఎందుకంటే నేను హాస్పిటల్లో లేవలేని దారుణ పరిస్థితిలో ఉన్నాను. అయితే మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే నేను బయటపడ్డాను. అభిమానులు, ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. నేను కోలుకున్న తరువాత ఈ సినిమా చేశా. పది సినిమాలు చేసినంత కష్టం ఈ సినిమాకి చేశాం. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం జీవిత. మీరందరూ ఈ సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
'ఈ సినిమా మాకు మరిచిపోలేని సినిమా అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు రాజశేఖర్ గారికి కోవిడ్ వచ్చింది. ఈ సినిమా పూర్తి కావడానికి ఆర్టిస్టులు, టెక్నిసిషన్స్ ఎంతో సపోర్ట్ చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. సినిమా కంప్లీట్ అయ్యింది. రాజశేఖర్గారి బర్త్ డే రోజు 'కిన్నెర సాంగ్'ను రిలీజ్ చేయటం, దానికి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. మా సినిమా పాటల్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. రెండు రోజుల్లో ఫస్ట్ కాపీ వస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొస్తాం' అని దర్శకురాలు జీవిత రాజశేఖర్ తెలిపారు.