Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా కెరీర్లో 'రాక్షసన్' కంటే ముందు కూడా హిట్లున్నాయి. కానీ, 'రాక్షసన్' మాత్రం నా మార్కెట్‌ని పెంచేసింది. ఈ సినిమా తరువాత చాలా ప్రాజెక్ట్‌లు వచ్చాయి. పెద్ద బ్యానర్లు, మంచి డైరెక్టర్లతో సినిమాలు ఓకే అయ్యాయి. మధ్యలోనే కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయి. నాకు ఇలా జరగడం ఏంటి? అనే కోపంతోనే నిర్మాతగా మారాలనుకున్నాను. అందుకే 'ఎఫ్ఐఆర్' సినిమాని నిర్మించాను.
'మా 'ఎఫ్ఐఆర్' సినిమా రఫ్ కట్ చూసి, హీరో రవితేజగారు గ్యారెంటీ హిట్ అని చెప్పారు. అంతేకాదు ఆయన సమర్పణలో ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాం' అని తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ చెప్పారు.
ఆయన తాజాగా నటించిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎఫ్ఐఆర్'. మను ఆనంద్ దర్శకుడు. అగ్ర కథానాయకుడు రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఈనెల 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో విష్ణు విశాల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
గౌతమ్ మీనన్ గారితో దర్శకుడు మను ఆనంద్ పని చేశారు. ఆయన ఓ సున్నితమైన కథని నెరేట్ చేశారు. అది విని, నేను ఈ సినిమా చేస్తున్నామని చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది చాలా చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సినిమా కోసం మను ఆనంద్ చాలా రీసెర్చ్ చేశారు.
నిజ జీవితంలో ఓ ముస్లిం అబ్బాయికి జరిగిన ఘటనలను కూడా ఉదాహరణగా చూపించారు. మతాన్ని ఆధారంగా చేసుకుని ఇలాంటి ఘటనలు ఎక్కడైనా, ఎవరికైనా జరగొచ్చు. ఈ సినిమాలో మాత్రం ఏ మతాన్ని కూడా కించపరిచేలా సన్నివేశాలు లేవు. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు వ్యక్తిగతంగా నాకూ కొన్ని ఘటనలు గుర్తొచ్చాయి. ఈ సినిమాలో మతం కంటే మానవత్వమే గొప్పది అని చెప్పే ప్రయత్నం చేశాం.
నాకు గౌతమ్ మీనన్ సర్ అంటే చాలా ఇష్టం. నేను ఆయన అభిమానిని. అంతే పెద్ద డైరెక్టర్ నా సినిమాలో, నా నిర్మాణంలో నటించటం చాలా ఆనందంగా ఉంది.
నా భార్య స్నేహితురాలు హీరో రవితేజ దగ్గర పని చేస్తుంటారు. మాటల్లో మా సినిమా గురించి ఆయనకు చెప్పారు. నా స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుందని రవితేజ అన్నారు. ఇలాంటి సినిమాలు ఎలా సెలెక్ట్ చేసుకుంటావని అడిగారు. నేను మీలా మాస్ హీరో అవ్వాలనుకుంటున్నానని చెబితే, ఆయనేమో నీలా కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలనుకుంటున్నానని అన్నారు. ఈ సినిమా రఫ్ కట్ చూసి గ్యారెంటీ హిట్ అని చెప్పటం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్లోనే ఈ సినిమా హయ్యస్ట్ బిజినెస్ చేసింది.
ఈ సినిమాలో డైలాగ్స్ మనసును తాకేలా ఉంటాయి. ప్రతీ పాత్ర, ప్రతీ డైలాగ్‌కు ఎంతో ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే ఏ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. పాత నటులే ఉంటే.. తరువాత ఏం జరగుతుందో ఊహించేస్తారు. అందుకే ఈ సినిమాకు చాలా మంది కొత్త వారిని తీసుకున్నాం. అలాగే ఇందులో పాటల కంటే ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. సినిమా సెకండాఫ్ మొత్తం కూడా యాక్షన్ పార్ట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మ్యూజిక్ అందర్నీ ఎంగేజ్ చేస్తుంది.
కరోనా తరువాత ప్రేక్షకులు ఓటీటీలో అన్ని రకాల సినిమాలు చూసేశారు. వారిని ఎంటర్టైన్ చేయాలంటే ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి. టైటిల్ నుంచి కూడా ఏదో ఒక కొత్తదనాన్ని ఆశిస్తుంటారు. అందుకే ఈ సినిమా టైటిల్‌ను 'ఎఫ్ఐఆర్' అని పెట్టాం. ఆ టైటిల్ మీనింగ్ ఏంటన్నది సినిమా చూశాక అర్థమవుతుంది.