Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడున్నర దశాబ్దాలుగా తన అత్యద్భుతమైన గాన మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని ఓలలాడించిన గాన కోకిల లతా మంగేష్కర్ ఇకలేరనే విషయం అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పాటల ప్రవాహానికి ప్రతీకగా నిలిచి కోట్లాది మంది ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న మెలోడీ క్వీన్ శాశ్వతంగా వీడ్కోలు పలకడంతో సంగీత ప్రపంచం కన్నీటిపర్యంతమైంది.
92 ఏండ్ల లతా మంగేష్కర్ ఇటీవల స్వల్ఫ కరోనా లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చేరారు. 29 రోజులకు పైగా వైద్యులు అందించిన చికిత్సతో ఆమె కరోనా నుంచి కోలుకున్నారు.
అయితే శనివారం సాయంత్రం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ సంగీత ప్రపంచం ఓ అద్భుత గాయనిని శాశ్వతంగా కోల్పోయింది.
అతి చిన్న వయసులోనే గాయనిగా ప్రస్థానాన్ని ఆరంభించి, తన తియ్యని పాటల మాధుర్యంతో పాటు అత్యద్భుతమైన వ్యక్తిత్వంతో భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకున్న లెజెండరీ గాయని లతా మంగేష్కర్.
1929లో ఇండోర్‌లో జన్మించిన లత (అసలు పేరు హేమ)కు సంగీతంలో గురువు తండ్రి దీనానాథ్ మంగేష్కరే. 1942లో ఆయన మరణించడంతో కుటుంబ పోషణ భారాన్ని లతా తీసుకున్నారు. 13 ఏండ్ల వయసులో 'కితి హసల్ ' (మరాఠి, 1942)లో 'నాచు ఏ గడే..' అంటూ సాగే పాటను తొలిసారి ఆలపించారు. అయితే సినిమా నిడివి ఎక్కువ అవ్వడంతో ఈ పాటను తొలగించారు. దీంతో గాయనిగా ఆమె పరిచయానికి బ్రేక్ పడింది.
అయితే కుటుంబాన్ని పోషించడం కోసం ఆమె నటించారు. 'పహ్లా మంగళ గౌర్' అనే మరాఠి చిత్రంలో హీరోయిన్‌కి చెల్లిగా నటించారు. అంతేకాదు ఇందులో రెండు పాటల్ని కూడా పాడారు. తర్వాత 'చిముక్లా సుసార్', 'గజేభావు', 'జీవన్ యాత్ర', 'మందిర్' చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఓ పక్క నటిస్తూనే, మరో పక్క గాయనిగా ప్రయత్నాలు చేశారు.
ఈ ప్రయత్నంలో భాగంగా 1948లో వచ్చిన 'మజ్బూర్' చిత్రంలో గులాం హైదరికి జోడీగా ఆమె పాడిన పాటకు పెద్ద బ్రేక్ వచ్చింది. దీని తర్వాత 1949లో ఆమె పాడిన 'బర్సాత్', 'దులారి', 'మహల్', 'అందాజ్' వంటి తదితర చిత్రాల్లోని పాటలు విశేష ప్రేక్షాదరణ పొందాయి. ఈ సినిమాలు సూపర్‌హిట్ అవ్వడంతో లత పూర్తి స్థాయి నేపథ్యగాయనిగా మరింత గుర్తింపు సొంతం చేసుకున్నారు.
దేశ విభజన వల్ల అగ్ర గాయనీగాయకులుగా పేరొందిన ఖుర్షీద్, నూర్జహాన్ పాకిస్థాన్‌కు వెళ్లిపోవడంతో లత పాటకు మరింత ప్రాధాన్యం పెరిగింది. 'అల్బేలా', 'ఛత్రపతి శివాజీ', 'అనార్కలీ', 'అందాజ్', 'బడీ బెహన్', 'ఆవారా', 'శ్రీ 420', 'మదర్ ఇండియా', 'దీవార్', 'దేవదాస్', 'చోరీ చోరీ', 'అదాలత్', 'జైలర్', 'మొహర్' వంటి చిత్రాలు ఆమెను స్టార్ గాయనిగా మార్చాయి.
కెరీర్ బిగినింగ్‌లో యాక్టర్ దిలీప్ కుమార్ ఆమె పాడే విధానాన్ని విమర్శించడంతో ఉర్దూ టీచర్‌ను పెట్టుకుని మరీ హిందీ పాటలు పాడారు. దక్షిణాదిలో లత పక్కన ఎంతోమంది సింగర్స్ పాడినా శభాష్ అనిపించుకున్న ఏకైక సింగర్ ఎస్పి.బాలు మాత్రమే. ఉచ్ఛారణ విషయంలో ఇద్దరూ నిబద్ధులే!
'మైనే ప్యార్ కియా' చిత్రంలో సల్మాన్‌కు బాలు, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్‌లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట సూపర్‌హిట్ అయ్యింది. యువత ఈ పాటలకు ఫిదా అయిపోయారు. ఆయనతో పాడిన పాటల్లో నాకు 'ఆజా షామ్ హౌనే ఆయీ ఇష్టం' అని లత చెప్పారు. లతతో కలిసి బాలు పాడిన 'దీదీ తేరా దేవర్ దివానా' పాట ప్రతి పెళ్లి మంటపాల్లో వినిపించింది. అలా వీరిద్దరి కాంబినేషన్లో దేశమంతా పాడుకునే పాటలొచ్చాయి. అయితే దక్షిణాది నుంచి ఏసుదాస్‌తో లతా కొన్ని పాటలు పాడినా అవి అంతగా గుర్తింపు పొందకపోవడం గమనార్హం.
తనదైన గాన మాధుర్యంతో గాయనిగా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న లతా మంగేష్కర్‌పై 1962లో విష ప్రయోగం జరిగింది. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి, మూడు నెలల అనంతరం కోలుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రవాహంలా పాటలు పాడారు. దాని ఫలితమే 'భారతరత్న' వంటి అత్యున్నత పురస్కారాన్ని అందుకునేలా చేసింది.
నాటి, నేటితరం సంగీత దర్శకులందరి సినిమాల్లో వేల పాటలు పాడ,ి గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం సొంతం చేసుకున్నారు. గాన కోకిలగా ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేశారు.
ఏడున్నర దశబ్దాల సినీ జీవితంలో వెయ్యికిపైగా చిత్రాల్లో 36 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడి అలరించారు. ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్, ప్యారేలాల్, కళ్యాణ్ జీ, ఆనంద్ జీ, బప్పీల హరి, రాం లక్ష్మణ్ అనంతరం ఏ.ఆర్.రెహ్మాన్ వరకు ఎందరో సంగీత దర్శకులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు.
లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో 712 పాటలు, ఆ తర్వాత శంకర్ జైకిషన్ చిత్రాల్లో 452, ఆర్.డి.బర్మన్ చిత్రాల్లో 327 పాటలు పాడి, వీరి కాంబోలో అత్యధిక పాటలు పాడిన గాయనిగా నిలిచారు.
ఇండియన్ నైటింగేల్‌గా ఆబాల గోపాలాన్ని అలరించిన లతా మంగేష్కర్ గాయనిగానే కాకుండా సంగీతదర్శకురాలిగా 'రామ్ రామ్ పహ్వానా', 'మరాఠా టితుక మెల్వవా', 'మోహిత్యంచి మంజుల', 'సాధి మనసే', 'తుంబడి మత' వంటి మరాఠీ చిత్రాలకు స్వరాలను సమకూర్చారు. అలాగే 'వాదల్', 'జహంగీర్', 'కాంచన్', 'లేకిన్' వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ హిందీ, మరాఠీ చిత్రాలను నిర్మించి నిర్మాతగానూ తన అభిరుచి చాటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.
2001లో భారతరత్న, 1999లో పద్మ విభూషణ్, 1989లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, 1969లో పద్మ భూషణ్, 60వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'వన్ టైమ్ అవార్డు ఫర్ లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్' గౌరవాన్ని అందుకున్నారు. అలాగే 'లేకిన్', 'కోరా కాగజ్', 'పరిచరు' చిత్రాల్లో పాటలు పాడి ఉత్తమ గాయనిగా మూడు జాతీయ అవార్డులను అందుకున్నారు. వీటితోపాటు అనేక డాక్టరేట్లు అందుకున్నారు.
1963లో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నెహ్రూ సమక్షంలో లతా పాడిన 'ఆయే మేరే వతన్..' అనే పాట విని ప్రధాని సైతం కంటతడిపెట్టారు. 1974లో లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో గాన ప్రదర్శన ఇచ్చి మొదటి భారతీయ గాయనిగా నిలిచారు. 1999లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
లత చెల్లెలు ఆశాభోంస్లే సైతం గాయనిగా భారతీయ సినిమా చరిత్రలో ఓ అధ్యాయాన్ని సృష్టించడం విశేషం. లక్షలాది మంది సంగీత ప్రియులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు మధ్య లతా మంగేష్కర్ అంతిమ సంస్కారాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి.
ఆణిముత్యాల్లాంటి పాటలు..
నవరసాలను ఒలికించే పాటలతో అశేష సంగీత లోకాన్ని లతా మంగేష్కర్ ఉర్రూతలూగించారు.
ఆయేగా... ఆనేవాలా
(చిత్రం: 'మహల్', సంగీతం: ఖేమ్‌చంద్ ప్రకాశ్)
ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో
('సాధన', దత్తానాయక్ )
ప్యార్ కియాతో డర్నా క్యా
('మొఘల్ - ఎ - ఆజమ్', నౌషాద్)
కహీ దీప్ జలే, కహీ దిల్
('బీస్సాల్ బాద్', హేమంత్ కుమార్)
యే మేరె దిలే నాదా
('టవర్ హౌస్', రవి)
తూ జహా చలేగా
('మేరా సాయా', మదన్ మోహన్)
ఛోడ్ దే సారీ దునియా కిసీకే లియే
('సరస్వతీ చంద్ర', కల్యాణ్‌జీ, ఆనంద్జీ)
సత్యం శివం సుందరం
('సత్యం శివం సుందరం',లక్ష్మీకాంత్, ప్యారేలాల్)
ఆయే మేరే వతన్ కే లోగో
(ప్రైవేట్ సాంగ్, సి. రామచంద్ర)
ఏ తుమ్హీ మేరీ మందిర్
('ఖాన్దాన్', రవి)
ఆప్ కీ నజ్రో..
('అన్పఢ్', మదన్ మోహన్)
వీటితోపాటు 'దిల్ మేరా తోడా', 'దునియా బదల్గయి..', 'బర్సాత్ మే హమ్ మిలే', 'బేరీ బిందియా', 'రిమ్ జిమ్ రిమ్ జిమ్ సావన్ బర్సే', 'జానేవాలే ఓ జానావాలే' వంటి ఎన్నో పాటలు శ్రోతల్ని విశేషంగా అలరించి గాన కోకిల బిరుదుని సార్థకం చేశాయి.
తెలుగులో మూడే మూడు పాటలు
1955లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'నిదుర పోరా తమ్ముడా..' (సంతానం), 1965లో ఎన్టీఆర్ నటించిన 'శ్రీ వేంకటేశ..' (దొరికితే దొంగలు), 1988లో అక్కినేని నాగార్జున నటించిన 'తెల్ల చీరకు..' (ఆఖరి పోరాటం) వంటి పాటలతో అలరించారు. 1959లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్ గురించి ఓ వ్యాసాన్ని ప్రచురించి 'భారతీయ నేపథ్య గాయకుల రాణి'గా అభివర్ణించింది.