Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏ ఇబ్బంది లేకుండా కుటుంబంతో కలిసి 'డిజె టిల్లు' చిత్రాన్ని చూడొచ్చు' అని చెబుతున్నారు దర్శకుడు విమల్ కష్ణ. ఆయన దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'డిజె టిల్లు'.
ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. ఈనెల 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం దర్శకుడు విమల్ కష్ణ మీడియాతో మాట్లాడుతూ, ''నేను కథ రాస్తే, హీరో సిద్ధు డైైలాగ్స్ రాశాడు. సినిమా తొలి భాగాన్ని ఎంత ఆస్వాదిస్తారో, ద్వితీయార్థాన్నీ చూస్తూ అంతే ఆనందిస్తారు. ట్రైలర్లో చూస్తే నాయిక చుట్టూ ముగ్గురు, నలుగురు మగాళ్లు ఉన్నట్లు చూపించాం. ఆ నలుగురు సోదరులు అవొచ్చు, స్నేహితులు అవొచ్చు. కానీ సమాజం మహిళను ఆ సందర్భంలో చూసే కోణం వేరు. ఈ దక్పథం తప్పు. అయితే ఈ విషయాన్ని సందేశంగా చెబితే ఎవరికీ నచ్చదు. కానీ నవ్విస్తూ, వినోదాత్మకంగా చూపిస్తే చూస్తారు. అలాగే ట్రైలర్లో రొమాంటిక్ ఫ్లేవర్ చూసి, ఇది పూర్తి రొమాంటిక్ సినిమా అనుకుంటున్నారు. కావాలని రొమాన్స్ ఎక్కడా చేయించలేదు. పైగా అది హద్దులు దాటేలా ఉండదు. ఈ సినిమాలో హీరోకి ఉన్న ఈ క్వాలిటీ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది. అలాగే నాయిక పాత్ర పేరు రాధిక. నేటి తరం అమ్మాయి. నిర్మాత నాగవంశీ చాలా సపోర్ట్ చేశారు. త్రివిక్రమ్‌గారు స్క్రిప్ట్ విషయంలో మంచి సూచనలు ఇచ్చారు. ఈ సినిమాతో కొత్త టేకింగ్, ఫ్రెష్ మేకింగ్ చూపించాలన్నదే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాం అని అనుకుంటున్నాం. సోమవారం హీరో సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి 'నీ కనులను చూశానే..' పాటను విడుదల చేశాం. దీనికి రవికాంత్ పేరెపు సాహిత్యాన్ని అందించగా, సిద్ధు పాడటం విశేషం' అని తెలిపారు.