Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు లాక్డౌన్లు తట్టుకుని సినిమాని రిలీజ్ చేసే స్థాయికి వచ్చాం. ఓటీటీలో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ థియేటర్లోనే ఈ సినిమా చూస్తే సెలబ్రేషన్ చేసినట్టు ఉంటుంది. అందుకే అందరూ థియేటర్లోనే మా చిత్రాన్ని ఈనెల 11న చూడండి.
- నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'సెహరి'. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 11న థియేటర్లలో విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక సోమవారం రాత్రి ఘనంగా జరిగింది.
హీరో హర్ష్ కనుమిల్లి మాట్లాడుతూ, 'మా సినిమాకి అందరూ బాగా సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా మంచి మైలేజ్ వచ్చింది. నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశా. అలాగే కొన్ని సినిమాలకు ఆడిషన్‌కి వెళ్ళాను. కానీ ఎక్కడా సెలక్ట్ కాలేదు. అప్పుడు నా స్నేహితులు నిన్ను నువ్వే ప్రూవ్ చేసుకోవాలన్నారు. దాంతో కసి పెరిగింది. అలా హీరోగా ఈ సినిమా చేశా. లాక్డౌన్ టైంలో బాలయ్యబాబు పోస్టర్ లాంచ్ చేశారు. దాంతో ఈ సినిమా స్థాయి పెరిగింది. అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలై, మంచి ఆదరణ పొందాయి. యశ్ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు. సంగీత దర్శకుడు కోటిగారు మా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. మళ్ళీ మళ్ళీ చూసేలా ఈ సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను' అని అన్నారు.
'ఇందులో నేను నటుడిగా కొత్త తరహాలో కనిపిస్తాను. ప్రశాంత్ సంగీతం సినిమాకి హైలెట్‌గా నిలుస్తుంది. నేను సంగీతం చేసే తొలి రోజుల్లో అన్ని పాటలు హిట్ అవ్వాలనే కసితో చేసేవాడిని. అది ప్రశాంత్‌లో చూశాను. ఇందులో 9 పాటలున్నాయి. అన్నీ క్యాచీగా ఉన్నాయి' అని సంగీత దర్శకుడు కోటి చెప్పారు. చిత్ర దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ, 'నా లైఫ్‌లో ఈ సినిమా మర్చిపోలేనిది. ఈ సినిమా చేయడానికి బ్రదర్ అనిల్ కారణం. ఆయన వల్లే ఈ సినిమా చేశా. హర్ష్ చెప్పిన కథ వినగానే అప్పుడే హిట్ అవుతుందని చెప్పా' అని తెలిపారు.
సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి మాట్లాడుతూ, 'కోటిగారి సంగీతానికి నేను అభిమానిని. ఈ సినిమాలో ఆయన నటించడం ఆనందంగా ఉంది. రచయితలకు, గాయకులకు మరింత మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది' అని చెప్పారు.