Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన నయా సినిమా 'డిజె టిల్లు'. నేహా శెట్టి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. ఈ నెల 12న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ బుధవారం మీడియాతో సంభాషించారు.
ఆ విశేషాలు..
''కష్ణ అండ్ హిజ్ లీల' సినిమా తర్వాత నిర్మాత నాగవంశీ గారు సినిమా చేయమని అవకాశం ఇచ్చారు. అలా ఈ సినిమాకు శ్రీకారం చుట్టాం. నేను, దర్శకుడు విమల్ కష్ణ కలిసి ఈ సినిమాకి కథ, మాటలు రాశాం. ప్రేమ కథకు చిన్న క్రైమ్ కోణాన్ని జతచేసి రాసిన కథ ఇది. ప్రేమ కథే ఎక్కువగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూసిన మనుషుల్లో ఒక ప్రత్యేకమైన ప్రవర్తన గమనించాను. వాళ్ల క్యారెక్టర్లను తెరపై చూపించాలని, ఈ సినిమాలో ఆ పాత్రలను రూపకల్పన చేశాను. నేను పెరిగిన మల్కాజ్ గిరి ఏరియాలో యూత్ చాలా డిఫరెంట్‌గా ఉంటారు. తమ దగ్గర డబ్బు పెద్దగా లేకపోయినా, పైకి దర్పంతో ఉంటారు. అందరితో కలిసి స్నేహం చేస్తారు. ఎవరికైన అవసరం వస్తే సాయం చేస్తారు. ధైర్యంగా వ్యవహరిస్తుంటారు. వాళ్లలో నిజాయితీ ఉంటుంది. ఈ లక్షణాల స్ఫూర్తిగా తీసుకుని టిల్లు క్యారెక్టర్ రాసుకున్నాం. పూర్తిగా తెలంగాణ యాసతో మాట్లాడుతుంటాడు. త్రివిక్రమ్ గారి సూచనల నుంచి పుట్టిన అంశాలన్నీ కలిపి కథగా రాసుకున్నాం. వినోదంతో పాటు ఒక మంచి విషయం ఈ సినిమాలో ఉంటుంది. అది తెరపైనే చూడాలి. అప్పటిదాకా నవ్వించే టిల్లు ఒక మంచి విషయం చెప్పి ముగిస్తాడు. అది సందేశం ఇచ్చినట్లు కూడా అనిపించదు కానీ ప్రేక్షకులకు చేరుతుంది. హీరో కోణంలో సాగే కథే ఇది. అయితే నాయికకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. హీరో ప్రేమ బాధితుడు. ఆ బాధ, విసుగు నుంచే వినోదాన్ని రప్పించాం. నిర్మాత వంశీ గారు ఈ సినిమా చూస్తూ బాగా ఎంజారు చేశారు. అలాగే త్రివిక్రమ్‌గారు కూడా సినిమా చూశాక, ఇది ఏ రేంజ్ హిట్ అనేది చూడాలన్నారు. మేమూ విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నాం.