Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది రోజుల్లో గుడ్ న్యూస్
'సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, మా ప్రతిపాదనలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌గారు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు' అని చిరంజీవి అన్నారు.
గత కొన్నాళ్ళుగా పరిశ్రమలోని సమస్యలు, ఏపీలో టికెట్ ధరలపై అనిశ్చితి నెలకొంది. వీటిపై కూలంకషంగా చర్చించేందుకు గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను సినీ పెద్దలు కలిశారు. సినిమా పరిశ్రమ విషయంలో మంచి పాలసీని తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ పాలసీ ద్వారా చిన్న,పెద్ద సినిమాలకు న్యాయం జరుగుతుందని, అలాగే విశాఖపట్నంలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేస్తున్నామని, ఇకపై ఏపీలోనూ కనీసం 20 శాతం షూటింగ్ చేసే విధంగా నిర్మాతలు ప్లాన్ చేసుకోవాలని, రాజమౌళిలాంటి అగ్ర దర్శకులు తీసే భారీ బడ్జెట్ సినిమాల విషయంలో టికెట్ ధరలు, షోల విషయమై మరోసారి చర్చిస్తామని సీఎం జగన్ అన్నారు.
'పెద్ద, చిన్న సినిమాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరల విషయంలో, అలాగే చిన్న సినిమాకే అని కాకుండా పెద్ద సినిమాలకు సైతం ఐదవ షోని రన్ చేసుకునే వెసులుబాటు, విశాఖలో సినిమా ఇండిస్టీని అభివృద్ధి చేయాలని, దీని కోసం పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహాకాలను అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. ఈనెల మూడోవారం ఈ సమస్యల పరిష్కారాన్ని చూపే జీవో వచ్చే ఛాన్స్ ఉంది' అని తెలిపారు.
'సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, చర్చలు నిర్వహించేలా చర్యలు తీసుకున్న చిరంజీవిగారికి ధన్యవాదాలు. గత ఆరు నెలల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అయోమయ వాతావరణం నెలకొని ఉంది. ఈ రోజుతో పెద్ద రిలీఫ్ దక్కింది. వారం, పది రోజుల్లో గుడ్ న్యూస్ వింటాం' అని హీరో మహేష్‌బాబు చెప్పారు. 'భారీ సినిమాలు రిలీజైనప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకటం లేదు. చిన్న చిత్రాలను కాపాడ్డమే లక్ష్యంగా సీఎం జగన్‌గారు తీసుకున్న నిర్ణయం హర్షనీయం. సమస్యల పరిష్కారానికి చిరంజీవి పెద్ద పాత్ర పోషించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలూ నంది అవార్డులు ఇచ్చే విధంగా చర్చలు జరపాలని కోరుకుంటున్నా' అని నటుడు, దర్శక,నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు.
'మా ప్రతిపాదనలన్ని విని మంచి నిర్ణయం తీసుకున్నందుకు జగన్‌గారికి, వీటిని ఆయన దృష్టికి తీసుకెళ్ళిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు' అని దర్శకుడు రాజమౌళి చెప్పారు.