Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమన్, గరీమ చౌహన్ హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. సతీష్ పరమవేద దర్శకత్వంలో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి హర్షిత్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నిర్మాత 'దిల్' రాజు క్లాప్ ఇచ్చారు. 'నాంది' ఫేమ్ విజరు కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. మునుగూడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ, 'రామాయణంలో జనకుడి పాత్ర ఎక్కడైనా కనపడిందా?, సీత తండ్రిగా ఆయన ఏం చేశారు? ఈ పాయింట్ బేస్ చేసుకుని, నల్గొండలో జరిగిన ప్రణరు - అమత ప్రేమకథ, మారుతి రావు ఇష్యూని మేళవించి ఫిక్షనల్ స్టోరీ రాశా' అని తెలిపారు. 'దర్శకుడు సతీష్, మా కాంబినేషన్లో 'ఊరికి ఉత్తరాన' సినిమా తీశాం. అది ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రేమ వివాహం తర్వాత అమ్మాయి తండ్రి పడే బాధ ఎలా ఉంటుంది?, కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది?, కుటుంబ సభ్యులు, ప్రేమికులు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం' అని నిర్మాత రాచాల యుగంధర్ చెప్పారు. హీరోగా తనకిది తొలి చిత్రమని, నిర్మాతలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సుమన్ అన్నారు.