Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విష్ణు విశాల్ హీరోగా నటించిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎఫ్ఐఆర్'. మను ఆనంద్ దర్శకుడు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదలయింది. అగ్ర హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా తెలుగులో రిలీజ్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.
ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ,'ఈ సినిమాకి తమిళంలో మంచి ఓపెనింగ్స్ వచ్చి విజయవంతంగా నడుస్తోంది. తెలుగులో కూడా మంచి ఆదరణ పొందుతోంది. కరోనా మూడో వేవ్ తర్వాత థియేటర్ ఓనర్లు, పంపిణీదారులు మా సినిమా ఫలితంపై ఆనందంగా ఉన్నారని చెప్పడం మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్టనిపించింది. రవితేజ బేనర్ ఆర్టి.టీమ్ వర్క్స్‌తో విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా ఓ తెలుగు, తమిళ సినిమాను నిర్మించనున్నాం' అని తెలిపారు. 'నా తొలి సినిమా తెలుగులోనూ విడుదలకావడం ఆనందంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది' అని దర్శకుడు మను ఆనంద్ అన్నారు. అభిషేక్ పిక్చర్స్ సిఇ.ఓ. వాసు మాట్లాడుతూ, 'తెలుగులో 262 థియేటర్లలో మా బ్యానర్ ద్వారా విడుదల చేశాం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా మంచి ఆదరణ పొంది, పబ్లిక్ విన్నర్‌గా నిలిచింది. థ్రిల్ చేసే అంశాలతోపాటు మంచి సందేశం కూడా ఉంది' అని చెప్పారు.