Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను శైలజ', 'రెడ్' వంటి తదితర భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు కిషోర్ తిరుమల. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు. శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి తదితరులు ముఖ్యపాత్రలు నటించారు. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలోకి రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు కిషోర్ తిరుమల బుధవారం మీడియాతో మాట్లాడుతూ,'మన ఇంట్లో, మన చుట్టూ ఉన్న మహిళలు మనకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. సదుద్దేశంతో మన జీవితాలను తీర్చిదిద్దాలనుకుంటారు. వారి మనస్తత్వాలు ఆసక్తికరంగా ఉంటాయి. వాళ్ళు చిన్న, చిన్న ఆనందాలను మాత్రమే కోరుకుంటారు. తమ వాళ్ళ దగ్గర పెద్దగా డిమాండ్స్ చేయరు. అలాంటి ఆడవాళ్లకు గుర్తుగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాను. కథాపరంగా చెప్పాలంటే..ఒక ఇంటిలో ఒకే ఒక వారసుడు పుడతాడు. అతనికి ఐదుగురు అక్కా చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళు అతన్ని ఎంత గారాబంగా, బాధ్యతగా చూస్తారనేది ఇందులో చూపించాను. ఒకే ఒక వారసుడిగా శర్వా నటన అద్భుతం. శర్వా మాదిరిగానే నాయిక రష్మిక సైతం కథ విని వెంటనే గ్రీన్ సిగల్ ఇచ్చారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు 'నువ్వు నాకు నచ్చావ్' లాంటి సినిమాల సెన్సిబిలిటీస్ మీకు గుర్తొస్తాయి. పైగా మహిళా ప్రాధాన్యం ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసి చాలా ఏండ్లయ్యింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా వస్తోంది. గొప్ప స్థాయిలో వినోదాన్ని పంచే సినిమా ఇది. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, పాటలు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాయి. నా తదుపరి సినిమా నిర్మాత డివివి దానయ్య గారితో ఉంటుంది. రోమ్-కామ్‌గా తెరకెక్కబోయే ఈ సినిమాలో నాగ చైతన్యని హీరోగా అనుకుంటున్నాం' అని అన్నారు.