Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూసధోరణిలో సాగిపోతున్న సినిమా సంగీతానికి తనదైన డిస్కో స్టయిల్ని జోడించి శ్రోతల్ని ఊర్రూతలూగించిన లెజెండరీ సంగీత దర్శకుడు బప్పిల హరి(69) ఇకలేరు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ముంబాయిలో తుదిశ్వాస విడిచారు. సంగీత సంచలనంగా పేరొందిన బప్పిలహరి ఇకలేరనే వాస్తవాన్ని సంగీత ప్రియులు, ఆయన అభిమానులు జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు.
హుషారెత్తించే బాణీలతో యావత్ సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఓలలాడించిన బప్పిలహరి 1952లో పశ్చిమబెంగాల్లోని జల్పారుగురిలో జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ సంగీతకారులు కావడంతో బప్పిలహరి కూడా చిన్నప్పట్నుంచే సంగీతంలో ప్రావీణ్యం పొందారు. శిక్షణా సమయంలోనే సరికొత్త సంగీతం కోసం బప్పిలహరి ప్రయోగాలు చేశారు.
పాశ్చాత్య డిస్కోథెక్ థీమ్‌లను మన సంగీతానికి అన్వయించి మంచి డాన్స్ నెంబర్స్‌గా తీర్చిదిద్దిన ప్రజ్ఞాశాలి. అలాగే మెలోడీ పాటలకూ పక్కా కేరాఫ్. మాతృభాష బెంగాలీతోపాటు హిందీ, తెలుగు, మలయాళ చిత్రాలకు ఆయన సంగీతం సమకూర్చారు. బాలీవుడ్లో మిధున్ చక్రవర్తి నటించిన 'డిస్కో డాన్సర్' కోసం ఆయన కంపోజ్ చేసిన ప్రతి పాట సూపర్‌హిట్టయ్యింది. దీంతో విలక్షణ సంగీత దర్శకుడిగా ఆయనకు బాలీవుడ్లో మంచి గుర్తింపు లభించడంతోపాటు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. 'సాహెబ్', 'డాన్స్ డాన్స్', 'గురు దక్షిణ', 'కమాండో' 'గురు', 'త్యాగి', 'ప్రేమ ప్రతిజ్ఞ', 'రాక్ డ్యాన్సర్' వంటి తదితర సినిమాలు ఘన విజయం సాధించడంతో అతితక్కువ టైమ్‌లోనే అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగారు. కృష్ణ నటించి, నిర్మించిన 'సింహాసనం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బప్పిలహరి సంగీతం పరిచయమైంది. ఈ సినిమాలోని 'ఆకాశంలోని ఒక తార..' పాటతో పాటు మిగిలిన పాటలూ శ్రోతల్ని మెస్మరైజ్ చేశాయి. 'త్రిమూర్తులు', 'సామ్రాట్','స్టేట్‌రౌడీ', 'గ్యాంగ్‌లీడర్', 'రౌడీ అల్లుడు', 'నిప్పురవ్వ', 'బిగ్‌బాస్' వంటితర చిత్రాలు సైతం మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. సంగీత దర్శకుడిగా, గాయకుడిగానే కాకుండా ఒంటినిండా బంగారు ఆభరణాలను ధరించి ఆహార్యం పరంగా కూడా అంతర్జాతీయంగానూ తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున బప్పిలహరి ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.