Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'ప్రాజెక్ట్ - కె'. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొనె హీరోయిన్గా నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ పూర్తి నిడివిగల శక్తివంతమై పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సిలో జరుగుతోంది. భారతీయ చిత్రాల్లోని అత్యంత భారీ ప్రాజెక్ట్‌ల్లో ఒకటైన ఈ సినిమా కోసం స్టూడియోలో ఓ కొత్త ప్రపంచాన్నే సష్టించారు మేకర్స్. ఈ షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని బిగ్ బి తెలిపారు. 'బాహుబలి ప్రభాస్‌తో మొదటి రోజు మొదటి షాట్.. పూర్తయింది. ప్రభాస్ ప్రతిభ, హుందాతనం ప్రేమతో నిండిపోయి ఉన్నాయి. ఇంకా తెలుసుకోవాల్సి ఉంది' అని అమితాబ్ ట్వీట్లో పేర్కొన్నారు.
దీనికి స్పందిస్తూ, లెజెండరీ నటుడితో కలిసి నటించడం తన కల నిజమైన రోజు అని ప్రభాస్ అన్నారు. 'నేటితో నాకు ఒక కల నిజమైంది. లెజెండరీ అమితాబ్ బచ్చన్ సర్‌తో ఈ రోజు 'ప్రాజెక్ట్ కె' మొదటి షాట్‌ను పూర్తి చేశాను' అంటూ ప్రభాస్ ఆనందం వ్యక్తం చేశారు .
'ఇండియాలోని బిగ్గెస్ట్ స్టార్స్‌ను ఒకే చోటకు తీసుకొచ్చేందుకు అద్భుతమైన కథను రాశారు దర్శకుడు నాగ్ అశ్విన్. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టీమ్ అందరికీ ఈ చిత్రం చిరకాలం గుర్తుండిపోనుంది. అలాగే ఈ సినిమాతో కచ్చితంగా సినీ ప్రేమికులు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.