Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సర్హద్ భీమ్లానాయక్.. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్.. శ్రీశైలం తహసీల్దారు, హఠకేశ్వరం మండలం, ఆంధ్రప్రదేశ్.. నేను ఇవతల ఉంటేనే చట్టం... అవతలకొస్తే కష్టం.. వాడికి'' అంటూ పవన్‌కల్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్‌లతో అటు ఆయన ఫ్యాన్స్‌ని, ఇటు ప్రేక్షకుల్ని ఊర్రూతలూగిస్తోంది 'భీమ్లానాయక్' ట్రైలర్' అని అంటున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
పవన్‌కళ్యాణ్, రానా కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం 'భీమ్లానాయక్'.
ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెల 25న వరల్డ్‌వైడ్‌గా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, 'హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ఈ 'భీమ్లా నాయక్' సొంతం. భీమ్లా నాయక్ ( పవన్ కళ్యాణ్), డేనియల్ శేఖర్(రానా)ల మధ్య సాగే సన్నివేశాలు, సంభాషణలు, పోరాట దశ్యాలు, పాటలు, నేపథ్య సంగీతం దేనికదే ఒకదాన్ని మించిన మరొకటి అన్నట్టుగా సాగి అభిమానుల ఆనందం అంబరాన్ని తాకేలా చేశాయి. నేడు (మంగళవారం) ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాం. హైదరాబాద్, యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరగబోయే ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.టి.ఆర్ ముఖ్య అతిథిగా, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. అంగరంగ వైభవంగా ప్రేక్షకాభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో చిత్ర బందం అంతా పాల్గొననుంది' అని తెలిపారు.