Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసిన సినిమా టిక్కెట్ల రేట్ల జీవో 35ను రెవిన్యూ అధికారులు అమలు పరచటం ఎంతమాత్రం కరెక్ట్ కాదు' అని నిర్మాత నట్టికుమార్ అన్నారు. గురువారం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యవర్గంతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నట్టికుమార్ మాట్లాడుతూ, 'నేడు (శుక్రవారం) 'భీమ్లా నాయక్' సినిమా విడుదలవుతుండటంతో బుధవారం సాయంత్రం నుంచి ఎమ్మార్వోలు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు థియేటర్ల వారిని టార్చర్ పెడుతున్నారు. 5, 10, 15, 20 రూపాయల చొప్పున టిక్కెట్లు అమ్మాలని, లేకపోతే కేసులు పెడతామని రెవిన్యూ అధికారులు వత్తిడి తెస్తున్నారు. కొత్త జీవో వచ్చేలోపు థియేటర్ల వారు జాయింట్ కలెక్టర్లకు సమాచారాన్ని అందజేసి, సినిమా టిక్కెట్ల రేట్లను తగినంతగా పెంచుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, అధికారులు మాత్రం దాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. బెదింరించి, వేధించడం కరెక్ట్ కాదు' అని తెలిపారు.
'థియేటర్లను తనిఖీలు చేయటం తప్పుకాదు. కానీ సస్పెండ్ అయిన జీవో రేట్లకు టిక్కెట్లను అమ్మమనటం తప్పు. సీఎం జగన్ గారు ఈ విషయంపై అధికారులకు మీరు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం మీ నుంచి కొత్త జీవో వచ్చే వరకైనా గతంలో ఉన్న జీవో 100ని అమలు చేయండి' అని నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ చెప్పారు. సెక్టార్ చైర్మన్ ఏలూరు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, 'ఎక్కడైనా కరెంటు, పెట్రోలు రేటు ఒక్కటే ఉంది. అలాగే ఎ, బి, సి సెంటర్ ఏదైనా సరే సినిమా టికెట్ రేటు ఒకటే ఉండాలి' అని అన్నారు.