Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు దర్శకత్వంలో రూపొందిన 'కళ్ళు' చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు శివాజీ రాజా.
భిన్న చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. 37 సంవత్సరాల సుదీర్ఘ నట ప్రయాణాన్ని కొనసాగించిన శివాజీ రాజా పుట్టినరోజు నేడు (శనివారం). ఈ సందర్భంగా తన నట ప్రస్థానం గురించి శివాజీ రాజా మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'నటుడిగా ఈ 37 ఏండ్ల కెరీర్లో 500 సినిమాలకు పైగా నటించాను. భిన్న సినిమాలు, పాత్రలు చేశాను. హీరోగా కూడా చేశాను. కానీ ఏ సినిమాతోనూ సక్సెస్ రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా.. ఇలాంటి పాత్రల్లోనే ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. కష్ణవంశీ ఇచ్చిన పాత్రలు నాకు మంచి పేరు తెచ్చాయి. అలాగే నా రాజా ప్రొడక్షన్ బ్యానర్ పై తీసిన సినిమాలు, సీరియల్స్‌కి కూడా మంచి పేరొచ్చాయి. నేను చేసిన సీరియల్స్ అన్నింటికీ నంది అవార్డులు రావడం గర్వంగా ఉంది. 'మా' అధ్యక్షుడిగా ఎంతో సమర్థవంతంగా, సభ్యులందరికీ మేలు జరిగేలా చూశాను. అలాగే మా శివాజీ రాజా ఛారిటబుల్ ట్రస్ట్ పై పేద కళాకారులకు సేవ చేయాలన్న ఆలోచన ఉంది. మొగిలయ్య లాంటి కళాకారుల ప్రతిభ గుర్తించి, సపోర్ట్ చేస్తే వాళ్ళ జీవితాలు మారతాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి చాలా మంది పేద కళాకారులు ఉన్నారు. వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను సినిమాలు చేస్తూనే వ్యవసాయం కూడా చేస్తున్నాను. నాకున్న స్థలంతోపాటు ఫామ్ హౌస్‌లో కూడా రకరకాల పంటల్ని పండిస్తున్నాను. దీని ద్వారా వచ్చే పండ్లని, కాయగూరల్ని కరోనా టైమ్‌లో చాలా మందికి అందజేశాను. వీటితోపాటు నిత్యావసర వస్తువుల్ని కూడా నా శక్తికి మించి ఇచ్చాను. ఇందులో నాకు కలిగిన తృప్తి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం నేను ఎఫ్ఎన్సిసి క్లబ్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. నేను నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక నా సొంత బ్యానర్లో 'కళ్ళు' సినిమాను మా అబ్బాయితో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. తను ప్రజెంట్ ఓ హిందీ సినిమాతో పాటు తెలుగులో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు' అని శివాజీరాజా చెప్పారు.