Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వై2కె సమస్య కారణంగా హైదరాబాద్‌లోని ఓ కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం 'నాతిచరామి'. అరవింద్ కష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి.కె నిర్మించారు. నాగు గవర దర్శకుడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రికార్డ్ స్థాయిలో 20 ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో ఈ నెల 10న స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మాట్లాడుతూ, 'దర్శకుడు నాగు నెరేట్ చేసిన కథ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఈ కథ నా జీవితానికి చాలా దగ్గరగా ఉందని పించింది. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది. భార్యాభర్తల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాలో చాలా బాగుంటాయి' అని తెలిపారు. 'ఈ సినిమాని ఈ నెల 10న అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్,యమ్.ఎక్స్.ప్లేయర్ వంటి 20 ఓటీటీ ఛానెల్స్‌లో విడుదల చేస్తున్నాం. ఇందులో నటించిన వారందరూ చాలా చక్కగా నటించారు. దర్శక, నిర్మాతలు మా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ మీద ఎంతో నమ్మకంతో, ధైర్యంగా విడుదల చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్‌కి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాకి కూడా అందరూ తప్పకుండా కనెక్ట్ అవుతారు' అని ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ రాజీవ్ అన్నారు.
దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ, 'అరవింద్ కష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి.. ఈ ముగ్గురి పాత్రల మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా.బలమైన సన్నివేశాలు, అర్థవంతమైన సంభాషణలు, అద్భుతమైన అభినయంతో సినిమా ఉంటుంది. 1999 - 2000 ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. దీంట్లో క్రైమ్ కంటే దీని చుట్టూ జరిగిన డ్రామా అందరికీ బాగా నచ్చుతుంది. ఇందులోని శ్రీలత క్యారెక్టర్లో పూనమ్ కౌర్ అద్భుతంగా నటించింది. సినిమా చూసి బయటికి వచ్చిన తరువాత కూడా శ్రీలత క్యారెక్టర్ మీ వెంట వస్తుంది' అని చెప్పారు.
నటుడు అరవింద్ కష్ణ మాట్లాడుతూ, 'నా కెరీర్ ఈ సినిమా వెరీ స్పెషల్ ఫిల్మ్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యే ఇలాంటి రోల్స్ చాలా తక్కువ వస్తాయి' అని అన్నారు. 'ఇందులో నా పాత్రను నాగు గారు చాలా చక్కగా డిజైన్ చేశారు. నా జీవితంలో ఈ సినిమా ఒక మైల్ స్టోన్‌గా నిలిచిపోతుంది' అని నటుడు సందేశ్ బురి తెలిపారు. జయశ్రీ రాచకొండ మాట్లాడుతూ,' ఇదొక విమెన్ సెంట్రిక్ సినిమా. చాలా మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు.
ఈ చిత్రానికి ఎడిటర్: వినోద్ అద్వయ, లైన్ ప్రొడ్యూసర్: కె. మల్లిక్, సినిమాటోగ్రఫీ: మహి శేర్ల, స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్: ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్, ప్రొడ్యూసర్: జై వైష్ణవి.కె, స్క్రీన్ ప్లే - దర్శకత్వం: నాగు గవర.