Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భారతదేశానికి తలమానికమైన కశ్మీర్లో హిందూ పండితుల పై టెర్రరిస్టుల దాడి ఎందుకు జరిగింది?, వారిని ఊచకోత ఎందుకు కోశారు?, ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు?, అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటి? అనే విషయాలను నిక్కచ్చిగా తమ 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంలో చూపించామని చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి తెలిపారు.
దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మరు మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ తదితరులు నటించిన బాలీవుడ్ చిత్రం 'కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ బుధవారం హైదరాబాద్లో మీడియా సమావేశంలో పాల్గొంది.
ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ, 'ఈ కథను నేను రాయలేదు. టెర్రరిజం ద్వారానే తెలుసుకుని సినిమా తీశాను. 1990 దశకంలో హిందూ పండితులను టార్గెట్ చేసి కొంతమంది టెర్రరిస్టులు ఊచకోత కోశారు. వారి పిల్లలను చంపేశారు. పెద్దలను పారిపొమ్మని భయపెట్టి, మహిళలను ఇక్కడే బందీలు పెట్టుకుని, నరకం చూపించారు. ఈ విషయాలేవీ ప్రపంచానికి తెలీయనీయకుండా కొంతమంది దాచేశారు. వాటికి వెలికితీయడంలో ప్రభుత్వం, మీడియా కూడా తప్పుదోవ పట్టించింది. అందుకే ఓ బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను. నాలుగేళ్ళపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను. ఈ సినిమా చూసి అసలు నిజాలు తెలుసుకోండి' అని అన్నారు. 'కశ్మీర్ ఇండియాలో భాగం. 30 ఏళ్ళగా ఇలాంటి కథను ఎవ్వరూ తీయలేదు. వాస్తవం ఏమిటి అనేది ఈ సినిమా ద్వారా చూపించారు. ఇందులో భాగమైనందుకు ఆనందంగా ఉంది' అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ చెప్పారు. మరో నిర్మాత పల్లవిజోషి మాట్లాడుతూ, 'యు.ఎస్.లోని కశ్మీర్ పండితులు ఈ సినిమా గురించి మాట్లాడుతూ, మా హదయాల్ని టచ్ చేశారని చెప్పారు. తేజ్ నారాయణ్, అభిషేక్ మాపై నమ్మకంతో ముందుకు వచ్చి, విడుదలకు సహకరించినందుకు థ్యాంక్స్' అని తెలిపారు.