Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి ఇంద్రజ గురువారం మీడియాతో ముచ్చటించారు. 'దర్శకుడు శాంటో నెరేట్ చేసిన కథ చాలా ఆసక్తికరంగా, సరికొత్తగానూ అనిపించింది. సహజంలో ఫ్యామిలీలో తండ్రి (భర్త) డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అయితే కుటుంబంలో తల్లి ప్రాధాన్యత ఎంత ఉంటుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఇందులో మురళీ శర్మ నా భర్తగా నటించారు. ఇంటి బాధ్యతని నేనే నిర్వర్తిస్తుంటాను. నా భర్త దగ్గర లేని క్వాలిటీని కొడుకు దగ్గర చూడాలని, చిన్నప్ప ట్నుంచీ జాగ్రత్తగా పెంచుతాను. అయితే నా కొడుకు కూడా తన తండ్రిలాగానే ఉన్నాడని తెలిసి బాధపడతాను. చివరికి నా కొడుకు నన్ను ఏ విధంగా అర్థం చేసుకున్నాడనే ముగింపు ఈ సినిమాలో చాలా బాగుంటుంది. యూత్‌తోపాటు తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. యూత్ పని, ప్యాషన్ అనే అంశాలకు ఏదో ఒక దాని కోసం కష్టపడుతుంటారు. అలా కాకుండా తమకిష్టమైన పనిని చేస్తూనే ఎలా బతకవచ్చో, అలాగే భార్యా భర్తల మధ్య రిలేషన్ ఎలా ఉండాలి?, తల్లిదండ్రులకు తమ పిల్లలతో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ గురించి కూడా ఈ తరానికి బాగా అర్థమయ్యేలా దర్శకుడు చూపించారు. ప్రస్తుతం నేను మూడు కొత్త సినిమాల్లో నటిస్తున్నాను' అని ఇంద్రజ చెప్పారు.