Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా 'క్లాప్' సినిమాలో కామెడీ, డాన్స్, ఫైట్స్ ఉండవు. కానీ చూసే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో చాలా ఉన్నాయి' అని హీరో ఆది పినిశెట్టి అన్నారు. ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంటగా శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీస్ పతాకాల పై రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'క్లాప్'.
బిగ్ ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐ.బి. కార్తికేయన్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి పృధ్వీ ఆదిత్య దర్శకుడు.
ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో నేడు (శుక్రవారం) సోనీలివ్‌లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా గురువారం ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర టీజర్, ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ, 'ఈ కథని విన్నప్పుడు ప్రేక్షకుడిగా ఫీలై విన్నాను. ఇందులో కమర్షియల్ అంశాలు లేకపోయినా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పగలను. ఇందులో చాలా కోణాలను దర్శకుడు చూపించారు. నేను,ఆకాంక్ష స్పోర్ట్స్ పర్సన్స్‌గా నటించాం. మా ఇద్దరి జర్నీ మరొకరి భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దిందనేది ప్రధాన అంశం. ఇళయరాజా గారి రీరికార్డింగ్ సినిమాకు బలం' అని అన్నారు. 'ఈ మూవీలో నటించడం గౌరవంగా భావిస్తున్నా. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. చాలా ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. ఎంతగా నవ్విస్తుందో.. అంతే బాధ పడే సన్నివేశాలూ ఉన్నాయి' అని నాయిక ఆకాంక్ష సింగ్ చెప్పారు.
నిర్మాత ఎం.రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, 'స్పోర్ట్స్ బేక్డ్రాప్లో ఈ తరహా సినిమా రాలేదనిపించింది. ప్రకాష్‌రాజ్, ఇళయరాజా గారు పనిచేస్తున్నారనగానే హ్యాపీగా ఫీలయ్యా. మేం ఏదైతే అనుకున్నామో దాన్ని దర్శకుడు అద్భుతంగా తీశాడు. ఇందులో ఆది, ఆకాంక్ష, నాజర్ నటన ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తుంది' అని తెలిపారు.
'ఇదొక ఎమోషనల్ మూవీ. ఆదితో సినిమా అనగానే ఆయన ఎంపిక చేసుకునే కథపై మాకు నమ్మకముంది. దానికితోడు ఇళయరాజా సంగీతం ఎసెట్. మిగిలిన సీనియర్ నటులు బాగా నటించారు. నేడు సోనీలివ్ ఓటీటీలో ఈ సినిమా రాబోతుంది. చూసి ఆనందించండి' అని మరో నిర్మాత రామాంజనేయులు జవ్వాజి చెప్పారు.