Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర'. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమై భారీ షూటింగ్ షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది.
ఈ షెడ్యూల్లో జరిగిన షూటింగ్లో రవితేజతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న సుశాంత్ కూడా పాల్గొన్నారు. శుక్రవారం కథానాయకుడు సుశాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. నీలి రంగు కళ్ళతో, పొడవాటి జుట్టు, గడ్డంతో తీక్షణంగా చూస్తున్న సుశాంత్ లుక్ అందర్నీ విశేషంగా అలరిస్తోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందనే విషయాన్ని పోస్టర్ చెప్పకనే చెబుతోంది.
'అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ మొత్తం ఐదుగురు కథానాయికలు నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా నటిస్తున్నారు. రచయితగా పలు పవర్ఫుల్ చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్ విస్సా ఈ సినిమా కోసం కొత్త తరహా కథ రాశారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఈ చిత్రానికి పనిచేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్, డిఓపీ : విజరు కార్తీక్ కన్నన్, ఎడిటర్: శ్రీకాంత్.