Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా గత రెండేండ్లుగా బంగారం లాంటి సమ్మర్ సీజన్స్‌ని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయింది. అయితే ఈ ఏడాది మాత్రం గోడకి కొట్టిన బంతిలా రెట్టింపు వేసవి వినోదాన్ని అందించేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు. ఈ సమ్మర్ సీజన్‌ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలనే పట్టుదలతో పెద్ద నిర్మాతలందరూ ఓ కచ్చితమైన ఏకాభిప్రాయానికి వచ్చి, పెద్ద సినిమాల విడుదలకు కనీసం వారం రోజులు గ్యాప్ ఉండేలా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి తగ్గట్టే విడుదల తేదీలను సైతం ఖరారు చేశారు. వేసవి వినోదానికి పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్' బోణీ కొట్టింది. దీంతో ఏప్రిల్, మే నెలల్లో బోల్డెన్ని చిన్న,పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చి వేసవి బరిలో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. అయితే ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లతోపాటు ఓటీటీల హవా.. కలెక్షన్లపై కొంత మేర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కథాపరంగా బాగా నిరాశపర్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా సునామీ క్రియేట్ చేస్తోంది. గత రెండేండ్లుగా కరోనా కారణంగా వెలవెలబోయిన ధియేటర్లు నూటికి నూరుశాతం కెపాసిటీతో 'హోస్‌ఫుల్' బోర్డులతో కళకళలాడుతున్నాయి. బిజినెస్‌పరంగా నష్టాల్లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్ల వ్యవస్థకు సంబంధించి పివీఆర్, ఐనాక్స్ వంటి సంస్థల షేర్లు సైతం ప్రేక్షకుల రాకతో మరింత ఊపందుకున్నాయి. 'ఆర్ఆర్ఆర్'కి ముందు 'పుష్ప', 'అఖండ' చిత్రాలు సైతం భారీ విజయాల్ని సొంతం చేసుకుని, కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ సినిమాల సక్సెస్‌తో టాలీవుడ్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది.
ఈ జోష్ని కొనసాగిస్తూ ఈ సమ్మర్లో బోల్డెన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఏప్రిల్
ఏప్రిల్ నెలకు శుభారంభాన్ని పలుకుతూ తాప్సీ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రంలో ఏప్రిల్ 1న విడుదల కానుంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జె దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో తాప్సీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించింది.
యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో నటించిన 'గని' సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సయీ మంజేక్రర్ నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మించారు. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
ఏప్రిల్ 13న విజరు, పూజాహెగ్డే జంటగా నటించిన 'బీస్ట్' సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుండగా, ఒక రోజు గ్యాప్‌తో ఏప్రిల్ 14న యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'కేజీఎఫ్2'ను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నారు. సంజరుదత్, రవీనాటాండన్, ప్రకాష్‌రాజ్, రావు రమేష్ వంటి హేమాహేమీలు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ పతాకంపై విజరు కిరంగదూర్ నిర్మించారు.
'గని', 'బీస్ట్', 'కేజీఎఫ్2' వంటి భారీ చిత్రాల తర్వాత యువ కథానాయకుడు నాగశౌర్య తన సొంత సంస్థ ఐరా క్రియేషన్స్ పతాకంపై నటించిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. షిర్లీ సెటియా నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అనీష్ ఆర్ కష్ణ దర్శకత్వం వహించారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదల కానుంది. ఇదే రోజున ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయితీ', విశ్వక్సేన్ హీరోగా నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటి తర్వాత ఏప్రిల్ 29న చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ కాంబినేషన్లో రూపొందిన 'ఆచార్య' చిత్రం వేసవి బరిలోకి దిగనుంది. కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పిస్తున్న ఈ చిత్రంలో నాయికలుగా కాజల్, పూజాహెగ్డే నటించారు.
మే
మహేష్‌బాబు, పరశురామ్ పెట్ల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. కీర్తిసురేష్ నాయికగా నటించిన ఈ సినిమాని మే 12న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఏఎంబి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు ఉన్నాయి.
గోపీచంద్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. రాశీఖన్నా నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బన్నీవాసు నిర్మించారు. దీన్ని మే 20న రిలీజ్ చేయబోతున్నారు.
వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మోహరీన్ నాయకానాయికలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన చిత్రం 'ఎఫ్3'. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని మే 27న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నారు. అడివిశేష్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'మేజర్', వైష్ణవ్‌తేజ్ నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమాలు ఇదే రోజున ప్రేక్షకుల ముందుకొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.