Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏ కథ రాసినా కామెడీ, థ్రిల్లర్, డ్రామా ఉండేలా చూసుకుంటాను. తెలుగులో 'చంటబ్బారు' తర్వాత డిటెక్టివ్ సినిమాలు పెద్దగా రాలేదు. 'లిటిల్ సోల్జర్స్' తర్వాత పిల్లలతో సినిమా రాలేదు. అందుకే వాటికి తగ్గట్టుగా కథ రాసుకుని తీసిన సినిమానే 'మిషన్ ఇంపాజిబుల్' అని దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె. చెప్పారు.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా సాధించిన విజయంతో దర్శకుడిగా స్వరూప్ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు
సొంతం చేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన నూతన చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'. తాప్సీ ప్రధాన పాత్రలో నటించగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు.
ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ, '2014లో దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తిని పట్టుకుంటే డబ్బులు ఇస్తామని పేపర్లో వచ్చిన ప్రకటన చూసిన పాట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబై వెళ్ళిపోతారు. ఈ వార్తను కథగా రాసుకున్నాను. 'తప్పడ్', 'పింక్' సినిమాల్లో తాప్సీ స్ట్రాంగ్ మహిళా పాత్రలు పోషించింది. అలాగే తెలుగులో ఆమె నటించి కూడా చాలా కాలమైంది. ఆమెకు కథ చెప్పాను. తన క్యారెక్టర్ చిన్నదైనా కథ నచ్చిందని అంగీకరించారు. ఆమె ప్రొఫెషనల్ యాక్టర్. ముందురోజే డైలాగ్‌లు తీసుకుని ప్రిపేర్ అయ్యేది. ఆరు గంటల కల్లా సెట్‌కి వచ్చే వారు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా ఆమె అద్భుతంగా నటించింది. కథ ప్రకారం ముగ్గురు పిల్లలు (రోషన్, బానుప్రకాష్, జైతీర్థ) దావూద్‌ను పట్టుకోవడం అనేది కామెడీగా అనిపించి చేశాం. ఇందులో 60 శాతం కామెడీ ఉంటుంది. మిగిలింది థ్రిల్లర్. వేసవిలో సమ్మర్ హాలిడేస్, ఉగాది పండుగ, సింగిల్ రిలీజ్ కాబట్టి పెద్ద సినిమాలున్నా, మా చిన్న సినిమా కూడా విడుదల చేస్తే వర్కవుట్ అవుతుందని భావించి రిలీజ్ చేస్తున్నాం. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తర్వాత నా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా హిట్ ఖాయం ' అని చెప్పారు.