Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 94వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఆదివారం ఘనంగా జరిగింది. కరోనా మహమ్మారి వల్ల గత రెండేండ్లుగా ఎలాంటి సందడి లేకుండా జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానం ఈ ఏడాది మాత్రం రెట్టించిన ఉత్సాహంతో సాగింది. విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఆస్కార్ కమిటీ ఈసారి హావభావాలకు, భావోద్వేగాలకు, వినోదానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.
దీంతో ఆస్కార్ ఉత్తమ చిత్రంగా 'కోడా' చిత్రం ఎంపికైంది. ఆస్కార్ ఉత్తమ చిత్రాల విభాగంలో 'డ్యూన్', 'బెల్ఫాస్ట్', 'డోంట్ లుక్ అప్', 'లికోరైస్ పిజ్జా', 'కింగ్ రిచర్డ్', 'నైట్మెర్ అలే', 'డ్రైవ్ మై కార్', 'వెస్ట్ సైడ్ స్టోరీ', 'ది పవర్ ఆఫ్ డాగ్' తదితర చిత్రాలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 'కోడా' రేసులో ముందు నిలిచి, ఆస్కార్‌ని కైవసం చేసుకుంది. ఫ్రెంచ్ సినిమా 'లా ఫామిల్లె బెలియర్' చిత్రానికి రీమేక్‌గా సియార్ హెడర్ ఈ చిత్రాన్ని 'కోడా'గా తెరకెక్కించారు. రూబీ అనే ఓ యువతి కథ ఇది. తనకి తప్ప తన కుటుంబంలోని అందరికీ వినికిడి సమస్య ఉంటుంది. తను సంగీతంలో రాణించాలని కలలు కంటుంది.
ఈ నేపథ్యంలో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, అలాగే తన
కలను నెరవేర్చుకోవడం కోసం ఆమె పడిన మానసిక సంఘర్షణే ఈ చిత్రం. ఈ ఏడాది పది విభాగాల్లో పోటీ పడిన 'డ్యూన్' చిత్రం ఏకంగా ఆరు విభాగాల్లో ఆస్కార్లను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్స్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో 'డ్యూన్' విజయకేతనం ఎగురవేసింది. అయితే 'కోడా' చిత్రానికి ఉత్తమ సహాయనటి విభాగంలోనూ ఆస్కార్ దక్కింది. ఈ ఏడాది కూడా మన దేశానికి నిరాశే మిగిలింది. డాక్యుమెంటరీ విభాగంలో పోటీ పడిన 'రైటింగ్ విత్ ఫైర్' ఆస్కార్ బరిలో నిలువలేకపోయింది.
ఆస్కార్ విజేతల వివరాలు
ఉత్తమ చిత్రం : కోడా, ఉత్తమ నటి : జెస్సీకా చాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ), ఉత్తమ నటుడు : విల్‌స్మిత్ (కింగ్ రిచర్డ్), ఉత్తమ దర్శకురాలు : జేన్ క్యాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), ఉత్తమ సహాయ నటుడు : ట్రారు కాట్సర్ (కోడా), ఉత్తమ సహాయనటి : అరియానా డిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: జెన్నీ బేవన్ (క్రుయెల్లా), ఉత్తమ సినిమాటోగ్రఫీ : గ్రేగ్ ఫ్రేజర్ (డ్యూన్), ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : డ్రైవ్ మై కార్ (జపాన్), ఉత్తమ డాక్యుమెంటరీ : ది క్వీన్ ఆఫ్ బాస్సెట్బాల్.
రెండోసారి..
జేన్ క్యాంపియన్ రెండోసారి ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్‌ని దక్కించుకుని, సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. తొలుత 'ది పియానో' చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ఫ్లే విభాగంలో ఆస్కార్‌ని సొంతం చేసుకున్న జేన్ తాజాగా ' ది పవర్ ఆఫ్ డాగ్' చిత్రానికి బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు. అంతేకాదు రెండుసార్లు ఆస్కార్లను అందుకున్న మూడవ మహిళా దర్శకురాలిగా జేన్ నిలిచారు. జేన్ కంటే ముందు కత్రియిన్ బిగెలో, క్లోయి ఝవో వంటి మహిళా దర్శకులు రెండు సార్లు ఆస్కార్లను కైవసం చేసుకున్నారు.
చెంప ఛెళ్..
ఆస్కార్ చరిత్రలోనే ఈసారి ఊహించని ఘటన జరిగింది. ఆస్కార్ వ్యాఖ్యాత కమెడియన్ క్రిస్ రాక్‌ని విల్‌స్మిత్ చెంప ఛెళ్..మనిపించాడు. గుండుతో వచ్చిన తన భార్య జాడ్ పింకెట్ గురించి కామెంట్ చేసినందుకు ఆవేశంతో విల్‌స్మిత్ ఇలా చేశారు. దీంతో ఆహుతులందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. విల్‌స్మిత్ భార్య అలోపేసియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాథి కారణంగా ఆమె జట్టు మొత్తం ఊడిపోయింది. ఇది తెలియక క్రిస్ కామెంట్ చేసి, చెంప దెబ్బ తిన్నాడు. అయితే ఉత్తమ నటుడిగా విల్‌స్మిత్ తొలిసారి అవార్డు అందుకుంటూ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.