Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ చిత్రం శనివారం శుభకత్ నామ సంవత్సరం ఆరంభమైన ఉగాది పర్వదినాన అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కరోనా తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఆద్యంతం వైభవంగా ఈ వేడుక నోవాటెల్‌లో (హెచ్ఐసిసిలో) జరిగింది.
పూజా కార్యక్రమాలు అనంతరం హీరో రవితేజ, హీరోయిన్లు నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ముఖ్య అతిథి చిరంజీవి క్లాప్ కొట్టగా, తేజ్ నారాయణ అగర్వాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్క్రిప్ట్ అందజేసారు. 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహౌత్రి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో 'టైగర్ నాగేశ్వరరావు' ప్రీలుక్ మోషన్ పోస్టర్‌ను చిరంజీవి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'శుభకత్ నామ సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలని ఆకాంక్షిస్తున్నాను. 'టైగర్ నాగేశ్వరరావు' కథను పాండమిక్ టైంలో దర్శకుడు వంశీ నాకు వినిపించారు. చాలా అద్భుతంగా నెరేట్ చేశారు. ఆ తర్వాత ఇది చేయటానికి నాకు సాధ్యపడలేదు. ఇప్పుడు నా తమ్ముడు రవితేజ చేయడం చాలా సంతోషంగా ఉంది. స్టువర్ట్ పురం నాగేశ్వరరావు గురించి నేను చిన్నప్పుడే చాలా విన్నాను. అప్పట్లో మా నాన్నగారు చీరాలలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ పక్కనే స్టువర్ట్పురం ఉండేది. అక్కడి వారంతా నాగేశ్వరరావుని హీరోగా కొనియాడుతుండేవారు. ఆసక్తితో నాన్నగారి నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇన్నాళ్ళ తర్వాత ఆయన గురించి వంశీ కమర్షియల్ కథగా తీర్చిదిద్దారు. రవితేజతో ఇంత మంచి చిత్రాన్ని నిర్మిస్తున్న అభిషేక్ అగర్వాల్‌కి అల్ ది బెస్ట్. ఇటీవల 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా కూడా అదే స్థాయి సక్సెస్ అవ్వాలి' అని చెప్పారు.
చిత్ర దర్శకుడు వంశీ మాట్లాడుతూ, 'చిరంజీవిగారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం ఆనందంగా ఉంది. రవితేజతో నాలుగేళ్ళుగా ప్రయాణం చేశాను. ఈ కథకు ఆయనే బాగుంటుందని అనుకోవడం, ఆయన కూడా అంగీకరించి మాకు ఎంతో ఎనర్జీ ఇచ్చారు. రవితేజ ఫ్యాన్సేకాదు తెలుగు హీరోల ఫ్యాన్స్ కూడా మెచ్చే చిత్రమవుతుందని హామీ ఇస్తున్నాను' అని తెలిపారు.
'చిరంజీవిగారు వచ్చి ఆశీర్వదించినందుకు, అలాగే కిషన్ రెడ్డిగారికి ధన్యవాదాలు. 'కశ్మీర్ ఫైల్స్'ను హిట్ చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు. ఈ 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను' అని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ అన్నారు. రవితేజ, నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణుదేశారు, మురళీశర్మ, షన్ముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు: వంశీ, నిర్మాత: అభిషేక్ అగర్వాల్, సమర్పకుడు: తేజ్ నారాయణ్ అగర్వాల్, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సంగీత దర్శకుడు: జివి ప్రకాష్ కుమార్, డిఓపీ : ఆర్ మదీ, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా.