Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమ్జుల ప్రొడక్షన్స్ తమ తొలి చిత్రంగా 'అసురగణ రుద్ర' చిత్రాన్ని నిర్మిస్తోంది. నరేష్ అగస్త్య, సంగీర్తన విపిన్, ఆర్యన్ రాజేష్ నటించనున్న ఈ చిత్రం ద్వారా మురళీ కాట్రగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మురళీ వంశీ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర ప్రారంభోత్సవం జూబ్లీహిల్స్ లోని దైవసన్ని ధానంలో జరిగింది.
హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు అగ్ర దర్శకుడు బి.గోపాల్ క్లాప్ కొట్టారు. నిర్మాత సి.కళ్యాణ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత వంశీ మాట్లాడుతూ, 'మా అన్నయ్య మురళీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మా బ్యానర్లో ఇది తొలి సినిమా. ఇదే టీమ్‌తో మరో సినిమా చేయబోతున్నాం. ఈ చిత్ర రెగ్యులర్ చిత్రీకరణ ఈనెల 6 నుంచి ఉంటుంది. మొదటిరోజే రెయిన్ ఫైట్‌తో యాక్షన్ సీన్ చేయ బోతున్నాం. అలాగే ఈ చిత్రం గురించి టైటిల్ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేశాం. నరేష్ అగస్త్య, శత్రు, మురళీ శర్మ, అమిత్ ఈ నలుగురిలో ఎవరు టైటిల్ పాత్రను పోషిస్తున్నారనేది చెబితే ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు, సెకండ్ ప్రైజ్ రూ.50 వేలు, మూడో బహుమతి రూ. 25 వేలు ఇవ్వనున్నాం. ఈ కాంటెస్ట్ వివరాలు మా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టాం. గెలుపొందిన వారికి ఆ పాత్ర పోషించే వారి చేతుల మీదుగా ప్రైజ్ మనీ అందిస్తాం' అని అన్నారు.
'ఈ సినిమాకి పనిచేస్తున్న వారంతా నా స్నేహితులే. టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, హీరోని డామినేట్ చేసేదిగా ఉంటుంది. మెడికల్ క్రైమ్ థిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. చూసేవారికి భయం కలిగించే విధంగా ఉంటుంది. ఇందులో అభినయ కీలక పాత్ర పోషిస్తున్నారు. కథంతా ఆమె చుట్టూరా సాగుతుంది. థ్రిల్లర్ సినిమాలో బెస్ట్ సినిమా అవుతుందనే నమ్మకముంది. మే1వ తేదీకి మొదటి షెడ్యూల్ పూర్తి చేస్తాం' అని దర్శకుడు మురళీ కాట్రగడ్డ చెప్పారు.
ఆమని, శత్రు, అమిత్, అభినయ, దేవీ ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ః అమరనాథ్ బొమ్మిరెడ్డి, సంగీతం ః శేఖర్ చంద్ర, ఫైట్స్ ః నబా మాస్టర్, ఎడిటర్ ః శ్రీకాంత్ పట్నాయక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ః శ్రీహరి గౌడ్, నిర్మాత ః మురళీ వంశీ, రచన, దర్శకత్వం ః మురళీ కాట్రగడ్డ.