Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై కట్ల ఇమ్మార్టెల్, అమ్మ రాజశేఖర్, అలీషా, షాలిని ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'ఎస్.ఎస్.డి' (స్టోరీ, స్క్రీన్‌ప్లే, డ్కెరెక్టర్).
కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఈ.డి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జీవిత, రాజశేఖర్ స్క్రిప్ట్‌ను అందించి, హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేశారు.
పసుర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యం.డి. ప్రశాంత్ కుమార్ క్లాప్ కొట్టారు. నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఈ.డి.ప్రసాద్ మాట్లాడుతూ, 'కామెడీ, హర్రర్, సెన్సిబుల్ లవ్ స్టొరీ ఉన్న మంచి సబ్జెక్ట్‌ను దర్శకుడు రాజేంద్రప్రసాద్ చెప్పగానే, నచ్చి ఈ సినిమాను నిర్మిస్తున్నాను.ఇందులో ఇద్దరు హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. అలాగే చాలామంది సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు. అందరూ ఫుల్‌గా నవ్వుకునే ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది' అని తెలిపారు. 'ఇది సినిమాలో ఒక సినిమా వాళ్ళ కథ. సినిమా ఇండిస్టీలో ఉన్న వాళ్ళు ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్స్, ఆర్టిస్ట్‌గా ట్రై చేసే వారు.. ఇలా సినిమా ఇండిస్టీకి సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి?, వారి జీవన విధానం ఎలా ఉంటుంది?, వారి జీవితంలో ఉండే కష్టాలు ఎలా ఉంటాయి?, వారంతా ఏ గోల్‌తో సినిమా ఇండిస్టీకి వస్తున్నారు?, ఈ నేపథ్యంలో వారి జీవితాలు ఎలా మారిపోతున్నాయి అనేదే ఈ సినిమా' అని దర్శకుడు కట్ల రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ,' దర్శకుడు రాజేంద్రప్రసాద్ నాకు మంచి ఫ్రెండ్. తను నేను గ్రూప్ డ్యాన్సర్స్‌గా, కొరియోగ్రాఫర్స్‌గా కలిసి చేశాం. ఇందులో మంచి రోల్ ఉంది నువ్వే నటించాలి అని చెబితే, నటిస్తున్నాను. అలాగే వారి అబ్బాయి కూడా ఇందులో హీరోగా నటిస్తున్నారు. శివారెడ్డి, చమ్మక్ చంద్ర, ఆలీ, సుమన్ శెట్టి, అనంత్.. ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది' అని చెప్పారు.