Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాత, చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు, ఏషియన్ మల్టీప్లెక్స్ అధినేత నారాయణదాస్ కె నారంగ్ (76) ఇకలేరు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల స్టార్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
పలు విజయవంతమైన చిత్రాల పంపిణీతో పంపిణీ రంగంలో తిరుగులేని డిస్ట్రిబ్యూటర్‌గా నారాయణదాస్ కె నారంగ్‌కి మంచి పేరు ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అనే బ్యానర్‌ని స్థాపించి నిర్మాతగానూ పలు సినిమాలను నిర్మించారు. వీటల్లో ఇటీవల నాగచైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందిన 'లవ్‌స్టోరీ' సినిమా ఒకటి. అలాగే ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో 'ది ఘోస్ట్', కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగానే కాకుండా చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగానూ చిత్ర పరిశ్రమకు ఆయన ఎన్నో సేవలందించారు. అలాగే ప్రేక్షకులకు అత్యంత సౌకర్యంగా ఉండి, సినిమాని ఎంజారు చేసేలా చూడాలనే ఉద్దేశంతో ఆయన నిర్మించిన ఏషియన్ మల్టిప్లెక్స్ థియేటర్లు సైతం మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాయి. పరిశ్రమలో ఎటువంటి సమస్య వచ్చినా, పంపిణీదారుల సమస్యలు ఏవైనా సరే ఎంతో చాకచక్యంగా పరిష్కరించి, మంచి ఇమేజ్ పొంది, అజాత శత్రువుగా నిలిచారు. ఆయన ఇద్దరు కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా నిర్మాతలుగా పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. నారాయణదాస్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నారాయణదాస్ మృతి పట్ల తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తోపాటు ఇతర అసోసియేషన్లు, పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి, నిబద్ధత కలిగిన వ్యక్తి, అపార అనుభవం ఉన్న వ్యక్తి, సినీ రంగంలో ఓ మహారథి మరణం తీరని లోటు.
- చిరంజీవి
నారాయణదాస్తో నాకు మంచి అనుబంధం ఉంది. నేను నటించిన పలు చిత్రాలు ఆయన సంస్థ ద్వారా విడుదలయ్యాయి. - పవన్‌కళ్యాణ్
నారాయణదాస్ వంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. సినిమాపై ఆయనకి ఉన్న విజన్, ప్యాషన్ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. - మహేష్‌బాబు