Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'టీజర్ అదిరిపోయింది కదా.. దీనికి రెండు రెట్లు ట్రైలర్ ఉంటుంది. ట్రైలర్‌కి పదిరెట్లు మా సినిమా 'అంటే.. సుందరానికి' ఉంటుంది. ప్రామీస్' అని అంటున్నారు యువ కథానాయకుడు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నానిగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'అంటే సుందరానికి'. ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రొమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకనేది .. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకే అర్ధమై పోతుంది. కొన్ని సినిమాలు, కథలు మరో దర్శకుడు తీస్తే ఎలా ఉంటుంది? అని ఊహించుకునే అవకాశం ఉంటుంది. కానీ దర్శకుడు వివేక్ తీసిన సినిమా మాత్రం వివేక్ తప్ప ఎవరూ తీయలేరనిపిస్తుంది. ఈ కథని వివేక్ చెప్పినట్లు ఎవరూ చెప్పలేరు. నాలోని ప్రేక్షకుడు వివేక్ చేసే సినిమాలు రిలీజైతే, ఫస్ట్ డే.. మార్నింగ్ షో చూడాలని ఫిక్స్ అయిపోయాడు.మా సినిమాలో నటించినందుకు నజ్రియాకి చాలా థ్యాంక్స్. అందర్నీ అలరించే సినిమా ఇది అని చాలా నమ్మకంగా చెప్పగలను' అని అన్నారు.
'స్క్రిప్ట్ రాసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. రాసింది రాసినట్లు వస్తే బాగుండు అని అనుకున్నాను. అయితే నా టీమ్ నేను రాసిన దానికంటే, ఊహించినదాని కంటే పదిరెట్లు అద్భుతంగా చేశారు. సినిమాటోగ్రాఫర్ నికిత్, సంగీత దర్శకుడు వివేక్, ఎడిటర్ రవితేజ, లతా, వరుణ్, పల్లవి.. టీం అందరికీ పేరుపేరునా కతజ్ఞతలు' అని దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ, 'ఈ సినిమా మాకు కూడా చాలా చాలా స్పెషల్. స్క్రిప్ట్ చదివినప్పుడే హిట్ అనుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో ఈ సినిమా కూడా ఉంది. ఈ స్క్రిప్ట్ వినగానే సూపర్ డూపర్ హిట్ అనుకున్నాం. దీంతోపాటు షూటింగ్ చేస్తున్నపుడే సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఫైనల్ అవుట్‌ఫుట్ చూశాక ఆ నమ్మకం ఇంకా పెరిగింది. మా బ్యానర్లో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేస్తున్నాం. అలాగే మే 12న మహేష్‌బాబు 'సర్కారు వారి పాట' తో వస్తున్నాం' అని చెప్పారు.
ఇదే నా మొదటి సినిమా అనే భావన కలుగుతుంది. బహుశా భాష వలన కావచ్చు. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి మీరు నాపై చూపిస్తున్న ప్రేమకి కతజ్ఞతలు. నా మొదటి తెలుగు సినిమాకి ఇంత మంచి టీమ్‌తో కలసి పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా మీ అందర్నీ కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. తెలుగు తెరకు పరిచయం అవుతూ ఇంత మంచి సినిమాలో నటించినందుకు గర్వంగా ఉంది.
- నాయిక నజ్రియా