Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆచార్య' ప్రీ రిలీజ్లో దర్శకుడు రాజమౌళి
'రానున్న రోజుల్లో ప్రాంతీయ సినిమా అనే కాన్సెప్ట్ ఉండదు. ఏ సినిమా తీసినా భారతీయ సినిమా అవుతుంది. అందుకు ఉదాహరణ రాజమౌళి తీసిన 'బాహుబలి', ఆర్ఆర్ఆర్' చిత్రాలు. అలాంటి సినిమాల రూపకర్త మన పరిశ్రమలో ఉండటం గర్వ కారణం. భారతీయ సినిమా ఒక మతమైతే, ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి. తెలుగు సినిమా ఆయన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి' అని చిరంజీవి చెప్పారు.
చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి నటించిన చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.
శనివారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ, ''రుద్రవీణ' సినిమాకి జాతీయ అవార్డు రావడంతో, అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లా. అక్కడ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో చుట్టూ రకరకాల పోస్టర్లతో భారతీయ సినిమా అంటే హిందీ సినిమాగా చూపించారు. చాలా బాధ అనిపించింది. దానికి సరైన సమాధానం ఈ మధ్యకాలం వరకూ దొరకలేదు. ఆ తర్వాత నేను గర్వపడేలా, రొమ్ము విరుచుకుని నిలబడేలా తెలుగు సినిమా హద్దులు, ఎల్లలు చెరిపేసి, భారతీయ సినిమా అని గర్వపడేలా 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'లు వచ్చాయి. మన సినిమా స్థాయి ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇక నేను, చరణ్ 'ఆచార్య'లో తండ్రీ కొడుకులం కాదు, గురుశిష్యులం కాదు, అతీతమైన అనుబంధం ఉన్న వ్యక్తులం. అలా చేయడం చరణ్ వల్లే సాధ్యమైంది. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకు తదుపరి చిత్రం ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకుంటారు. అది నిజం కాదు. నేను అలాంటివి నమ్మను. ఆ ఊహను 'ఆచార్య' తుడిచిపెట్టేస్తుంది' అని అన్నారు.
'ఎంత సక్సెస్ ఉన్నా నేలపై ఎలా నిలబడాలో, వినమ్రంగా ఎలా ఉండాలో చిరంజీవిగారిని చూసి నేర్చుకోవాలి. 'ఆచార్య' విజువల్స్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయి. చిరంజీవి అందుకున్న ఎత్తులు చరణ్ అందుకుంటారో లేదో తెలియదు కానీ, ఆయనతో సమానంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నా. కొరటాల శివలో ఉన్న మాస్ ఎలిమెంట్స్ మరే డైరెక్టర్‌లోనూ ఉండవు. 'ఆచార్య' డబుల్ బ్లాక్‌బస్టర్ అవుతుంది' అని రాజమౌళి చెప్పారు.
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, 'ఈ సినిమాతో నాకో మంచి 'ఆచార్య' దొరికారు. ఈ జర్నీలో చిరంజీవిలాంటి గొప్ప మనిషిని కలిశాను. ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు నిర్మాతగా రామ్‌చరణ్ కథ విన్నారు. సిద్థ పాత్ర గురించి చెప్పగానే, వెంటనే ఒప్పుకొన్నారు. 'ఆర్ఆర్ఆర్' జరుగుతున్న సమయంలోనే నేను అడగ్గానే చరణ్ డేట్స్ ఇచ్చిన రాజమౌళిగారికి ధన్యవాదాలు. సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా' అని తెలిపారు.