Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శ్రీ కష్ణదేవరాయలు మాదిరిగా సీఆర్సి నాటక కళా పరిషత్ నాటక రంగాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తోంది. పరిషత్ నిర్వాహకుడు విక్టరీ వెంకట్‌రెడ్డిగారి కోరిక మేరకు నేను పరిషత్‌కు గౌరవాధ్యక్షునిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. 22 ఏండ్ల నుంచి అప్రహాతితంగా నాటకరంగానికి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం' అని నటుడు, దర్శకుడు తనికెళ్ళభరణి అన్నారు.
వచ్చే ఏడాది రావులపాలెంలోని సీఆర్సి నాటక కళా పరిషత్ 23వ ఉగాది నాటకోత్సవాలలో జరగబోయే నాటక పోటీల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ,'తొలి ఉత్తమ ప్రదర్శనకు మూడు లక్షల రూపాయలు, రెండో ఉత్తమ నాటకానికి రెండు లక్షల రూపాయలు, మూడో ఉత్తమ నాటకానికి లక్ష రూపాయల బహుమతిని ఇవ్వబోతున్నాం. ఇది భారతదేశంలోనే నాటక కళాకారులకిచ్చే పెద్ద మొత్తమని భావిస్తున్నాం. ప్రపంచంలోని నలుమూలలా ఉన్న నాటక ప్రియులంతా ఈ నాటకాల్లో పాల్గొనటానికి అర్హులే. ఇది నిజంగా నాటకానికి మహర్దశ. ముఖ్యంగా నాటక కళాకారులకు ఈ అవకాశం ఆస్కార్ అవార్డుతో సమానం' అని అన్నారు. ఈ సమావేశంలో సీఆర్సి పరిషత్ కన్వీనర్ విక్టరీ వెంకటరెడ్డి, సీఆర్సి అధ్యక్షులు తాడి నాగమోహన్‌రెడ్డి, కర్రి అశోక్‌రెడ్డి, చిన్నం తేజారెడ్డి, కోట శంకర్రావు, నటుడు గౌతంరాజు, గుండు సుదర్శన్, త్రిమూర్తులు పాల్గొని నాటక పోటీల గురించి మరిన్ని వివరాలను తెలియజేశారు. అతిథిగా, యాంకర్‌గా విచ్చేసిన థియేటర్ ఆర్టిస్ట్, నటి ఝాన్సీ ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా నడిపించటం విశేషం.