Authorization
Mon Jan 19, 2015 06:51 pm
236 సినిమాల్లో దాదాపు 500లకు పైగా సూపర్ హిట్ పాటలతో గీత రచయితగా తనకంటూ పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తైదలబాపు. ఎలాంటి సందర్భానికైనా సరే సరళమైన పదాలతో పాటలను రాసి మెప్పించి, రాణిస్తున్న తైదలబాపు పుట్టినరోజు నేడు (సోమవారం).
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని గీత రచయితగా తాను చేసిన ప్రయాణాన్ని, అలాగే నిర్మాతగా మారబోతున్నాననే విషయాలను మీడియాతో మాట్లాడుతూ,'1998లో హైదరాబాద్‌కు వచ్చి సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌కు నేను రాసిన పాటలు పాడి వినిపించాను. పాటలు చాలా బాగున్నాయని, అవకాశాలిస్తానని చెప్పారు. అయితే తొలిసారిగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన '6 టీన్స్' అనే సినిమాతో వెండితెరకు గీత రచయితగా పరిచయం అయ్యాను. తర్వాత 'గర్ల్‌ఫ్రెండ్'కి కూడా రాశాను. ఆ సినిమాల్లో నేను రాసిన 'నువ్వు ఎక్కడికెళ్తే ఆడికొస్తా సువర్ణా..', 'ప్రేమెంత పనిచేసె నారాయణ', 'లష్కర్ బోనాల కాడ..' వంటి సూపర్ హిట్ పాటలు మంచిపేరు తీసుకు రావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆలా అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపు 236 సినిమాల్లో 500లకు పైగా పాటలు రాశాను. అన్ని రకాల పాటలు రాయడం నాకు ఆ దేవుడిచ్చిన వరం. 2019లో జాతీయ కళారత్న అవార్డ్‌ను, రచయితల సంఘం రజతోత్సవ వేడుకలో విశిష్ట రచనా పురస్కారాన్ని కూడా అందుకొన్నాను. తెలంగాణ ఉద్యమం కోసం నేను రాసిన పాటలు మంచి స్ఫూర్తిని కలిగించాయి. నా తండ్రి చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని, చిన్నతనం నుంచే పదిమందికి సాయం చేయడం అలవాటుగా మార్చుకున్నాను. నేడు (సోమవారం) నా పుట్టిన రోజు సందర్భంగా ప్రకతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్న పిలుపు మేరకు నా అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి మంచిర్యాల జిల్లాలో 2022వేల మొక్కలను నాటడానికి సన్నాహాలు చేస్తుండటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పాటల ద్వారా ప్రేక్షకులను అలరిస్తాను.అలాగే మంచి చిత్రాలు తీయాలనే తలంపుతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాను' అని అన్నారు.