Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా గత చిత్రాల్లో ఏమైతే చెప్పానో వాటికి పరిష్కారం 'ఆచార్య' చిత్రం. అన్నింటికి మూల కారణమైన ధర్మం గురించి ఈ చిత్రంలో చెబుతున్నా. ధర్మం కోసం పాటుపడే శక్తివంతమైన ఇద్దరు వ్యక్తుల కథ ఇది' అని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ నటించిన చిత్రం 'ఆచార్య'.
ఈ సినిమా ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ, 'తండ్రిగా కాకుండా సహ నటుడిగా రామ్‌చరణ్‌తో నటించటం నాకేమీ కొత్తగా అనిపించలేదు. అయితే నటన పరంగా చరణ్ మంచి పరిణితి సాధించినందుకు తండ్రిగా, నటుడిగా చాలా గర్వంగా ఉంది. అభిమానుల్ని, ప్రేక్షకుల్ని తప్పకుండా అలరించే సినిమా అవుతుంది' అని తెలిపారు.
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, 'నిజమైన తండ్రీకొడుకుల అనుబంధం 'ఆచార్య' కథకు అదనపు బలాన్ని తీసుకొస్తుందనే ఉద్దేశంతోనే సిద్థ పాత్రకు చరణ్‌కు తీసుకున్నాం. ఒకవేళ చరణ్ చేయకపోతే ప్రత్యామ్నాయం మాకు పవన్ కల్యాణ్‌గారే కనిపించారు. ఎందుకంటే కథలో ఆ ఫీల్‌ని 100 శాతం ఆయన తీసుకొస్తాడని నమ్మాను' అని అన్నారు. 'ఇది నా సినిమా కాదు. చిరంజీవిగారిది. నేను ఇందులో అతిథిని మాత్రమే (నవ్వుతూ). ఈ సినిమా కోసం నాన్నగారితో కలిసి చేసిన ఈ జర్నీ మాత్రం మధురమైన అనుభూతినిచ్చింది. ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ, రాజమౌళిగారికి కృతజ్ఞతలు. సిద్ధగా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తానని ఆశిస్తున్నాను. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం' అని రామ్‌చరణ్ చెప్పారు.