Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ధర్మం కోసం ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులు చేసే పోరాటమే 'ఆచార్య'. భిన్న నేపథ్యాలు, భిన్న మనస్తత్వాలు ఉన్న వీళ్ళిద్దరూ ఎలా కలిశారు?, వీరిద్దరికి ఒకటే లక్ష్యం ఎలా అయ్యింది' అనే విషయాలను ఎంతో ఆసక్తికరంగా 'ఆచార్య' రూపంలో తెరకెక్కించాను' అని దర్శకుడు కొరటాల శివ చెప్పారు.
చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ కథానాయకులుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆచార్య'. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని దర్శకుడు కొరటాల శివ బుధవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
తండ్రీ కొడుకులు కాదు..
నిజ జీవితంలో చిరంజీవిగారు, రామ్‌చరణ్ తండ్రీ కొడుకులు అయినప్పటికీ ఈ సినిమాలో మాత్రం తండ్రీ కొడుకులు కాదు. ఇద్దరివి భిన్న నేపథ్యాలు. భిన్న మనస్తత్వాలు. అయితే తండ్రీకొడుకులుగా వీళ్ళిద్దరి అనుబంధం మాత్రం ఈ కథని అత్యంత శక్తివంతంగా ప్రజెంట్ చేయటానికి బాగా ఉపయోగపడింది.
పక్కా కమర్షియల్ పంథా
నేనెప్పుడూ డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ ద్వారా కథని చెప్పాలని ప్రయత్నిస్తా. 'మిర్చి', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'జనతా గ్యారేజ్' సినిమాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. పక్కా కమర్షియల్ పంథాలోనే వెళ్తూ వీటిని తీశా. 'ఆచార్య' కూడా పక్కా కమర్షియల్ సినిమా. ఇలాంటి సినిమాని బిగ్ కాన్వాస్‌పై చూస్తే కచ్చితంగా థ్రిల్‌గా ఫీలవుతారు.
భిన్న పాత్రలు..
ఇందులో నక్సలైట్ 'ఆచార్య'గా చిరంజీవి, గురుకులంలో చదువుకునే విద్యార్థి సిద్ధాగా రామ్‌చరణ్ నటించారు. ఒకరు ఎగ్రెసివ్ అయితే, మరొకరు చిరునవ్వుతో ఉండే స్వభావం. అడవుల్లో ఉండే నక్సలైట్ ఓ టెంపుల్ టౌన్‌కి వస్తే, అలాగే గురుకులంలో చదువుకునే విద్యార్థి తన దారికి భిన్నంగా నక్సలైట్‌గా అడవుల్లోకి వెళ్ళాల్సి వస్తే.. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మం కోసం పోరాటే ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల కథే ఈ 'ఆచార్య'. 'ఆచార్య'గా చిరంజీవిగారు, సిద్ధాగా రామ్‌చరణ్ అత్యద్భుతంగా నటించారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది యువత రామ్‌చరణ్ పోషించిన 'సిద్ధా' పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. అంతేకాదు అలా ఉండాలని కూడా ప్రయత్నిస్తారనే నమ్మకం ఉంది.
మణిశర్మకే సాధ్యం
సహజంగా ఇలాంటి సినిమాలకు సంగీతం అందించడం చాలా కష్టం. పైగా ఈ సినిమాలో పాటలు వచ్చే సందర్భాలు చాలా క్లిష్టతరంగా ఉంటాయి. అయినప్పటికీ మణిశర్మగారు అత్యద్భుతమైన సంగీతం అందించారు. ఇందులోని పాటలు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి.
అదే నేర్చుకున్నా..
చిరంజీవిగారితో పని చేయటం, రామ్‌చరణ్ కూడా నటించటం, రామ్‌చరణ్ మదర్ సురేఖాగారి డ్రీమ్ ప్రాజెక్ట్‌ని నేను చేయటాన్ని గర్వంగా ఫీలవుతున్నా. 150 సినిమాలు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ చిరంజీవిగారు ఎంతో సహనంతో, ఓర్పుతో మొదటి సినిమాలా కష్టపడటం హ్యాట్సాఫ్. ఆయన దగ్గర్నుంచి నేను అదే నేర్చుకున్నా.
స్వామి వివేకానందపై సినిమా
ఏ మాత్రం అవకాశం వచ్చినా స్వామి వివేకానంద జీవితం ఆధారంగా 'గాంధీ' సినిమా స్థాయిలో ప్రపంచ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ఓ సినిమా చేయాలని ఉంది. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా త్వరలోనే స్టార్ట్ అవుతుంది.