Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. వెన్నెల క్రియేషన్స్ పతాకం పై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రం మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజరు కుమార్ కలివరపు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'నేను 6 ఏళ్లు షార్ట్ ఫిల్మ్స్ చేశాను. వాటిలో కొన్ని అవార్డులు గెలుచుకున్నాయి. అందులో 'ఐస్ ఆఫ్ హంగర్' ఒకటి. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేష్ మహా, 'డియర్ కామ్రేడ్' ఫేమ్ భరత్ కమ్మ వంటి వారితో నాకు స్నేహం ఉంది. అందుకే నాకు సినిమాకు దర్శకత్వం వహించడం కష్టంగా అనిపించలేదు. 'జయమ్మ పంచాయితీ' ఒక పొటెన్షియల్ స్క్రిప్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. టాప్ టీవీ యాంకర్ సుమతోపాటు లెజెండజరీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం ఈ చిత్రాన్ని వేరే లెవెల్‌కి తీసుకెళ్ళాయి. వీరికితోడు పవన్ కళ్యాణ్, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి హేమాహేమీలు మా సినిమాకి ప్రమోషనల్ సపోర్ట్ చేయటంతో అందరిలోనూ ఈ సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది. ఇంతమంది ప్రముఖులు మా సినిమాకు ప్రమోషన్ చేస్తారని నేను ఊహించలేదు. జయమ్మ పాత్రలో రమ్యకష్ణ వంటి నటి అయితే బాగుంటుంది అనుకున్నా.
అయితే వారిని ఇప్పటికే భిన్నమైన పాత్రల్లో చూశాం. తెలిసిన వాళ్ళు సుమ పేరుని సజెస్ట్ చేయడంతో ఆమెకి కథ నెరేట్ చేశాను. ఆమెకు కథ నచ్చటంతోపాటు జయమ్మగా నటించటానికి మంచి ఆసక్తి చూపించారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఆమె ముఖ్యమైన కారణం. శ్రీకాకుళం స్లాంగ్‌ని కూడా అలవోకగా నేర్చుకుని, పాత్రకి నూటికి నూరుపాళ్ళ న్యాయం చేశారు. ఈ కథ నిజమైన వ్యక్తుల నుండి ప్రేరణ పొందింది. నా జీవితంలో నేను కలిసిన వ్యక్తులను, వారి శైలిని నాటకీయంగా చూపించాను. ఇది కల్పిత కథ అయినప్పటికీ కొన్ని సన్నివేశాలను మాత్రం వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందాను. ఇక 'జయమ్మ పంచాయితీ' టైటిల్ కూడా కథ ఆధారంగానే వచ్చింది.
జయమ్మ ఒకప్పుడు సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. ఆమె గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. ఆమె చేసే పోరాటం పెద్ద వివాదంగా మారుతుంది. జయమ్మ అమాయకురాలు. ఆమె పోరాటంలో బలమైన అంశం ఒకటి దాగివుంది. అది ఏమిటినేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాలో ఉన్న నాలుగు పాటలూ.. ఒక్కొక్కటిగా కథను ముందుకు తీసుకెళ్తాయి. ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని తెలిపారు.