Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పోకిరి' సినిమాకి నేను ఎడిటర్‌గా చేశాను. ఆ సినిమా రష్ చూసినప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పా. ఇప్పుడు 'సర్కారు వారి పాట' ఫస్ట్ రష్ చూసిన తర్వాత 'పోకిరి'ని క్రాస్ చేస్తామని చెప్పా' అని అంటున్నారు సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్. మహేష్‌బాబు, కీర్తిసురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రి మూవీ మేకర్స్ ,జీ ఎం బీ ఎంటర్ టైన్మెంట్స్ , 14 రీల్స్ ప్లస్ పతాకాలపై నిర్మితమైన ఈ సినిమా మే 12న విడుదలవుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి పని చేసిన ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ శుక్రవారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు..
దర్శకుడు పరశురామ్ గారి సినిమాలు ఫ్యామిలీ డ్రామా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా ఉంటాయి. కానీ ఈ సినిమాలో హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
'గీత గోవిందం', 'పోకిరి'.. ఈ రెండు సినిమాలను నేనే ఎడిట్ చేశాను. ఈ రెండు సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. 'పోకిరి'కి మించి హిట్ అవుతుంది. ఇందులో ఓ మంచి ఫీల్‌తోపాటు అందరికీ కనెక్ట్ అయ్యే మెసేజ్ ఉంది. నేను చేసిన సినిమాలన్నింటి కంటే మహేష్ బాబు ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నారు. ఫ్యాన్స్, ఫ్యామిలీస్, మాస్‌కి ఈ సినిమా చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఫుల్‌గా, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్‌తో అదిరిపోతుంది.
ఇందులో విజువల్స్ చాలా గ్రాండ్ కనిపించడానికి మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ నిర్మాణ విలువలే కారణం. ఈ బ్యానర్ల నిర్మాతలు కథానుగుణంగా సినిమాని రిచ్‌గా తీయాలనే లక్ష్యంగా ఉంటారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడరు. సినిమా పట్ల వారికున్న అంకితభావం అభినందనీయం. ఇందులో నాకు నచ్చిన చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి.
ఈ సినిమా చూసిన తర్వాత హీరో, హీరోయిన్ పాత్రలను ఇష్టపడతాం. హీరోయిన్ పాత్ర చూసినప్పుడు ఇలాంటి అమ్మాయి మనకీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. హీరో పాత్రతో కనెక్ట్ అవుతాం. ఎడిట్ చేసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలిగితే ఆ సినిమా సూపర్ హిట్ అని జడ్జ్ చేస్తాం. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వచ్చింది. అవుట్‌ఫుట్ పట్ల మహేష్బాబుగారితోపాటు అందరం చాలా హ్యాపీగా ఉన్నాం.
నేను చేసిన సినిమాల్లో 'పోకిరి'ని ఈ సినిమా క్రాస్ చేస్తుంది. ఇప్పటి వరకు 450 సినిమాలు చేశాను. మహేష్ గారితో 'రాజకుమారుడు', 'టక్కరి దొంగ', 'పోకిరి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..', లేటెస్ట్గా 'సర్కారు వారి పాట'కి చేశాను. ప్రస్తుతం చిరంజీవి గారి 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్', సమంత కథానాయికగా నటిస్తున్న 'యశోద' సినిమాలకి చేస్తున్నాను. సీనియర్ దర్శకుల దగ్గర్నుంచి కొత్త దర్శకులతో పని చేయటం సంతృప్తికరంగా ఉంది.
- ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ ట్రాక్‌లో బాగా నవ్వుకున్నా. సెకండ్ హాఫ్‌లో వాళ్ళు ఎక్కడ కలిసినా చిన్న లాఫ్ వస్తుంది. థియేటర్లో ఈ సందడి పెద్దగా ఉంటుందని మా అంచనా. మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఓ పెద్ద పండగలా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. మహేష్‌బాబుతో మరో హిట్ సినిమాకి పని చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది.