Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి హీరోగా నటిస్తున్న 153వ చిత్రం 'గాడ్ ఫాదర్'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. అగ్ర నాయిక నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ అతిధి పాత్రలో సందడి చేయబోతున్నారు. అలాగే ఓ పూర్తి స్థాయి కీలక పాత్రలో యువ కథానాయకుడు సత్యదేవ్ కూడా మెరవబోతున్నారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మరో ప్రత్యేకమైన ఆకర్షణ జత చేరింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా నేతృత్వంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ పై ఒక ఎలెక్ట్రిఫైయింగ్ సాంగ్‌ని షూట్ చేయబోతున్నట్టు సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 'గ్రేట్ న్యూస్.. బాస్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కోసం ప్రభుదేవా ఆటమ్ బాంబింగ్ స్వింగింగ్ లాంటి పాటని కోరియోగ్రఫీ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి- సల్మాన్ ఖాన్ కలసి డ్యాన్స్ చేయడం అభిమానులకు ఒక పండగలా ఉండబోతుంది' అని తమన్ ట్వీట్ చేశారు.
'అటు మెగాస్టార్, ఇటు సల్మాన్‌ఖాన్‌తో ప్రభుదేవా చేసిన పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడీ స్టార్స్ ఇద్దరితో ఆయన చేయబోయే ఆటంబాంబులాంటి పాట అటు ప్రేక్షకుల్ని, ఇటు అభిమానుల్ని కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుంది' అని చిత్ర బృందం తెలిపింది.
శరవేగంగా జరుపుతున్న షెడ్యూల్స్‌తో ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆర్బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు.