Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్, దిల్ రాజు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న ఫన్ ఫ్రాంచైజీ 'ఎఫ్3'. థియేటర్లలో నవ్వులు పంచడానికి ఈ సినిమా రెడీ అవుతోంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాయిక సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ తన పాత్రకు సంబంధించిన విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.
అందుకే ఓకే చేశా..
నేను ఈ సినిమాలోకి రావడం వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. 'లెజెండ్' సినిమా జరుగుతున్నప్పుడే దర్శకుడు అనిల్ రావిపూడి గారితో పరిచయం. రామోజీ ఫిల్మ్ సిటీలో 'లెజెండ్' షూటింగ్ జరుగుతున్న సమయంలో అనిల్ గారు వేరే సినిమా షూటింగ్ చేస్తున్నారు. అప్పుడు భవిష్యత్‌లో కలిసి వర్క్ చేయాలనుకున్నాం. అయితే చాలా ఏళ్ల తర్వాత ఆయన నుండి ఫోన్ వచ్చింది. ''ఎఫ్3' సినిమా చేస్తున్నాను. ఓ పాత్ర కోసం మిమ్మల్ని అనుకుంటున్నాను' అని అన్నారు. మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. అనిల్‌గారు కామెడీ కింగ్. అప్పటికే 'ఎఫ్ 2' సినిమా చూశాను. హిలేరియస్ మూవీ అది. 'ఎఫ్ 2'కి మించిన ఫన్ 'ఎఫ్ 3'లో ఉంటుంది.
సీక్రెట్‌గా దాచి పెట్టాం
ఈ సినిమాలో నేను చేస్తున్న పాత్ర చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. నా పాత్ర సినిమాకి చాలా కీలకం కూడా. అందుకే నా పాత్రను ఇప్పటివరకు రివీల్ చేయలేదు. రీసెంట్గా రిలీజైన ట్రైలర్లో కూడా సీక్రెట్‌గా దాచిపెట్టాం. నా పాత్రలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్టైన్ ఫీలౌతారు. అయితే అన్ని పాత్రలకు కథలో మంచి ప్రాధాన్యత ఉంది.
ఇదే మొదటి సారి..
పూర్తి స్థాయిలో కామెడీ సినిమా చేయడం నా కెరీర్లో ఇదే మొదటిసారి. 'ఎఫ్ 3' లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేయడం ఒక ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే కామెడీ చేయడం అంత తేలిక కాదు. అనిల్ గారితో వర్క్ చేయడం ఆర్టిస్ట్‌కి చాలా ఈజీ. ఆయనే నటించి చూపిస్తారు. వెంకటేష్ గారితో పని చేయడం ఒక గౌరవం. ఇక వరుణ్ తేజ్ చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఈ సినిమా తర్వాత తమన్నా, మెహ్రీన్ మంచి ఫ్రెండ్స్ అయ్యాం. దిల్ రాజు, శిరీష్ గారు గ్రేట్ ప్రొడ్యూసర్స్. వారి నిర్మాణంలో పని చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ప్రస్తుతం నాగార్జున గారితో 'ఘోస్ట్' సినిమా చేస్తున్నా. ఇందులో నాది ఫుల్ యాక్షన్ రోల్. డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరించాలన్నదే నా లక్ష్యం. కథ నచ్చితే ఎటువంటి పాత్రనైనా చేసేందుకు రెడీగా ఉన్నాను.