Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎఫ్3' అందరి కోసం తీసిన వినోదభరిత చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీలు కలిసొచ్చి చూడాల్సిన సినిమా. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్ల రేట్లని తగ్గించాం. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిపోయారు. వాళ్ళని కూడా థియేటర్‌కి రప్పించాలనే ప్రయత్నంలో భాగంగానే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం' అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేేపథ్యంలో నిర్మాత దిల్ రాజు గురువారం మీడియాతో సంభాషించారు.. ఆ విశేషాలు..
'ఎఫ్2'ని మించి వినోదం
'ఎఫ్ 2' విడుదలకు ముందే అనిల్‌కు 'ఎఫ్ 3' ఐడియా వచ్చింది. 'ఎఫ్ 2' పెద్ద హిట్ అయితే 'ఎఫ్ 3' చేద్దామని చెప్పాను. మేం అనుకున్నట్లే 'ఎఫ్ 2' పెద్ద విజయం సాధించింది. 'ఎఫ్ 3' కథ చెప్పినపుడు ఎంత నవ్వుకున్నానో సినిమా చూసిన తర్వాత దానికి మించి నవ్వుకున్నాను. ఇదొక నాన్ స్టాప్ ఎంటర్ టైనర్. కంప్లీట్ ఫన్ రైడ్. 'ఎఫ్ 2'లో ప్రేమ, పెళ్లి.. అందులో ఉన్న ఫస్ట్రేషన్‌ని హిలేరియస్‌గా చూపించి, చివరికి భార్యల పాయింట్ ఆఫ్ వ్యూని కూడా చూడాలని అందరికీ నచ్చే విధంగా 'ఎఫ్2'ని హ్యుమరస్‌గా చేశాం. 'ఎఫ్ 3' విషయానికి వస్తే, పంచభూతాలతో పాటు ఆరో భూతం డబ్బు కూడా మనిషి బతకడానికి అంతే అవసరం. డబ్బు లేకుండా మనిషి బతకలేడు. బంధాలు, బిజినెస్‌లు.. అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అలాంటి డబ్బు చుట్టూ తిరిగే కథ ఇది. అనిల్ అద్భుతంగా రాయటమే కాకుండా తీశాడు.
నవ్వుతూనే ఉంటారు
'ఎఫ్ 3' ఆర్టిస్టులకు బొనాంజా లాంటింది. ఇంతమంది ఆర్టిస్ట్‌లను పెట్టుకుని అనిల్ అద్భుతమైన ఫన్ క్రియేట్ చేశాడు. సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సరికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాను. ఓ ప్రేక్షకుడిగా ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్పగలను.. సినిమా రన్ టైం 2 గంటల 28 నిమిషాలు ఉంటే, అందులో 90 నిమిషాలు నాన్ స్టాప్‌గా నవ్వుతూనే ఉంటారు. 'ఎఫ్ 2' పెద్ద సక్సెస్. మళ్ళీ అదే కాంబినేషన్లో సినిమా అనగానే వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్.. ఇలా అందరూ ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ తమ విశ్వరూపాన్ని చూపించారు.
వెంకటేష్‌కి రేచీకటి, వరుణ్‌కి నత్తి ఇలా కొత్త ఎలిమెంట్స్‌తో హిలేరియస్‌గా నవ్వించబోతున్నారు. అనిల్ ఓ మంచి ఐడియా చెప్పాడు. 'ఎఫ్4' కూడా ఉంటుంది.
థియేటర్లకు దూరమవుతున్నారు
కరోనా తర్వాత పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. ఆడియన్స్ ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడటానికి బాటా అలవాటు పడ్డారు. టికెట్ రేట్లు పెంచటం వల్ల చాలా మంది ప్రేక్షకులు థియేటర్‌కి దూరం అవుతున్నారు. అలాగే రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు. వాళ్ళందరిని కూడా థియేటర్‌కి రప్పించాలనే మా సినిమాకి టికెట్ ధరలు తగ్గించాం. అలాగే సినిమా స్టయిల్ కూడా మారుతోంది. ఎన్ని సినిమాలు చేసినా ఇప్పుడంతా లార్జన్ దేన్ లైైఫ్ సినిమాలు గురించే మాట్లాడుకుంటున్నారు. 'మార్వెల్', 'అవతార్' లాంటి సినిమాలే నిలబడుతున్నాయి. తెలుగులోనూ ఈ ట్రెండ్‌కి రాజమౌళి గారు శ్రీకారం చుట్టారు. మేం కూడా మూడు కథలపై పని చేస్తున్నాం. రెండేళ్ళలో ఒకటి, రెండు పెద్ద సినిమాలు మా బ్యానర్ నుండి ప్రకటించే అవకాశం ఉంది.