Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం 'మేజర్'.
శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన శోభితా ధూళిపాళ శనివారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
' 'గూడచారి' సినిమా చేస్తున్నపుడే మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితం గురించి హీరో అడవి శేష్ చాలా ఆసక్తికరమైన సంగతులు చెప్పేవారు. అయితే ఈ సినిమాలో నేను కూడా నటిస్తానని అప్పుడు నాకు తెలీదు.
ఓ పక్క సందీప్ జీవితం చూపిస్తూనే, మరో పక్క 26/11 దాడులు, తాజ్ ఇన్సిడెంట్‌ని సమాంతరంగా ఈ సినిమాలో చూపిస్తారు. 26/11 ఎటాక్స్‌లో నేను ప్రమోద అనే బందీగా కనిపిస్తా. భయం, దుఖ:ం, ధైర్యం, నమ్మకం, ఆశ, నిరాశ .. ఇలా అన్ని రకాల కోణాలు నా పాత్రలో కనిపిస్తాయి. భావోద్వేగాలతో నిండిన బరువైన పాత్ర.
ఆర్మీ కథలు యుద్ధం లేకపోతే ఒక సంఘటన మీద ఉంటాయి. అయితే 'మేజర్' సందీప్ లైఫ్‌లో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎంత కష్టం వచ్చినా కూడా ధైర్యమైన మార్గాన్ని ఎంచుకునే సామర్ధ్యం అందరిలోనూ ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. నటన పరంగా ఇప్పుడు అన్ని రకాల పాత్రలు చేయడానికి దర్శకులు, ప్రేక్షకుల నమ్మకాన్ని పొందానని భావిస్తున్నా.