Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విలక్షణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా మారుతూ కేఎస్ఐ సినిమా అన్‌లిమిలెట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తున్న చిత్రం 'యానం'. షేక్స్పియర్ రచనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కరుణాకరణ్ దర్శకుడు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ సినిమా బ్యానర్ లోగోను నిర్మాత బన్నీవాసు, 'యానం' చిత్ర టైటిల్ లోగోను దర్శకుడు ఇంద్రగంటి మోహనకష్ణ విడుదల చేశారు.
ఈ సందర్భంగా బన్నీవాసు మాట్లాడుతూ,' శ్రీకాంత్ అయ్యంగారు నిర్మిస్తున్న ఫస్ట్‌మూవీ మంచి విజయం సాధించాలి. కరోనా తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా మొదలు పెట్టడం గొప్ప విషయం. శ్రీకాంత్ గారు వర్సటైల్ ఆర్టిస్ట్. ఆయన నిర్మాతగా ఈ సినిమాతో కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
'శ్రీకాంత్‌గారు నాకు 2010 నుండి తెలుసు. నేను చేస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో అద్భుతమైన పాత్ర చేశారు. ఆయన తొలిసారి నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా, ఈ బ్యానర్ నవతరానికి ఒక మార్గం అవ్వాలి' అని ఇంద్రగంటి మోహనకష్ణ చెప్పారు.
నటుడు, నిర్మాత శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ, 'కరుణాకరన్ నేను దర్శకత్వం వహించిన నాటకాలు, యాడ్ ఫిలింస్‌కి వర్క్ చేశాడు. అందరికీ నా కుడి భుజం, నా ఆత్మ అని చెప్తూ ఉంటాను. ఈ సినిమా ద్వారా తను దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలి' అని అన్నారు. 'నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ అన్నకి ధన్యవాదాలు. ఆయన ఆలోచనలను తప్పకుండా ముందుకు తీసుకెళ్తాను. దానికి మీ అందరి సహాయసహకారాలు కావాలి' అని దర్శకుడు కరుణాకరణ్ చెప్పారు.