Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల 'వరుణ్ డాక్టర్', 'కాలేజ్ డాన్' వంటి వరుస విజయాలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కథానాయకుడు శివకార్తికేయన్.
ఆయన హీరోగా, 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవి దర్శకత్వంలో 'ఎస్కె 20' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్‌రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
'వినాయక చవితి పర్వదినాన తెలుగు, తమిళంలో ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. ఫస్ట్ లుక్, ఇతర అప్డేట్లు త్వరలో వెల్లడిస్తాం' అని నిర్మాత సురేష్‌బాబు చెప్పారు. ఈ సినిమా కథ భారతదేశంలోని పాండిచ్చేరి, బ్రిటన్‌లోని లండన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన , దర్శకత్వం: అనుదీప్ కె.వి, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సహ నిర్మాత: అరుణ్ విశ్వ.