Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు వారికి పాటంటే బాలు, మాటంటే బాలు అనుకునేంత చనువు ఏర్పడటానికి కారణం దాదాపు 50 ఏళ్ల ఆయన సినిమా పాటల ప్రయాణం. ఈనెల 4వ తేదీ గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకుని 'బాలుకి ప్రేమతో' అంటూ దాదాపు 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని కనీవినీ ఎరుగని రీతిలో రవీంద్రభారతిలో నిర్వహించేందుకు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ రంగం సిద్ధం చేసింది.
ఈ సందర్భంగా సినీ మ్యూజిషియన్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ, 'బాలు గారంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. ఈనెల 4న ఆయన జయంతి సందర్భంగా వేడుకని ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 12 గంటలపాటు సంగీత విభావరిని చేస్తూ బాలు జయంతిని కన్నులపండుగగా సెలబ్రేట్ చేస్తున్నాం. పాటల కచేరితో ఆ మహనీయుణ్ని గుర్తు చేసుకోవటం మేమందరం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం' అని అన్నారు. సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రెసిడెంట్ విజయలక్ష్మీ మాట్లాడుతూ, 'బాలుగారు మా కులదైవం. ఆయన దగ్గరుండి మా యూనియన్ సభ్యుల కోసం 2019లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. అద్భుతమైన ఆ ప్రోగ్రామ్ని కన్నుల పండుగలా జరిపి మా అందరికీ మార్గ దర్శకులుగా నిలిచారు. దురద్రుష్టవశాత్తు ఆయన్ని కోల్పోయాం. ఆయన చనిపోయిన సమయంలో సరిగ్గా ట్రిబ్యూట్ కూడా ఇవ్వలేదనే వెలితి మాలో ఉంది. ఈనెల 4న ఆయన జయంతిని పురస్కరించుకుని మా యూనియన్ 'బాలుకి ప్రేమతో' కార్యక్రమాన్ని చేస్తున్నాం' అని చెప్పారు.
సి.యం.యు ట్రెజరర్ రమణ శీలం మాట్లాడుతూ, 'తెలుగుపాటకు నిలువెత్తు సంతకం మా బాలు గారు. వారు లేరు అని మేం ఎప్పుడు అనుకోలేదు. ఆయన మాతోపాటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు అని అనుకుంటున్నాం. కాబట్టి వారి జయంతిని పెద్ద పండుగలా చేస్తున్నాం. ఇంత పెద్ద పండగను చేసుకోవటానికి మాకు అవకాశం కల్పించిన సీఎం కె.సి.ఆర్ గారికి, తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గారికి ప్రత్యేక కతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈ అద్భుతమైన వేడుకకు అందరూ ఆహ్వానితులే' అని తెలిపారు.