Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంజన, మూలవిరాట్ అశోక్ రెడ్డి నటీనటులుగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'సాచి'. సత్యానంద్ స్టార్ మేకర్స్ సమర్పణలో విధాత ప్రొడక్షన్ పతాకంపై వివేక్ పోతిగేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, భాషల్లో నిర్మాత ఉపేన్ నడిపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు అన్నపూర్ణలో సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆర్టిస్ట్ బిందుపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లాప్ కొట్టగా, నిర్మాత రామ్ మెహన్ రావు గౌరవ దర్శకత్వం వహించారు. సత్యానంద్ మాస్టర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, 'తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. నిజ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి 'సాచి' కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ప్రయత్నం చాలా మంచిది. ఇలాంటి సినిమాలు భావితరానికి చాలా అవసరం' అని తెలిపారు.
'మంగలి వత్తి చేస్తూ జీవనం సాగించే ఒక నిరుపేద కుటుంబ యజమాని బ్రెయిన్ ట్యూమర్ బారినపడితే, ఆ ట్రీట్మెంట్ కోసం వారి ఆస్తులను అమ్ముకొని, కుటుంబం రోడ్డున పడింది. అయితే తండ్రి చేసే మంగలి వత్తిని కూతురు స్వీకరించి, ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క ఎన్నో అవమానాలు, అవహేళలను ఎదు ర్కొంటూ ధైర్యంగా ఆ కుటుంబాన్ని ఎలా పోషించింది అనేది ఈ సినిమా. ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకొని మేం వారి కుటుంబానికి అండగా నిలబడాలని, కొంత నగదు సహాయం చేశాం. ఇందులో చాలా మంది కొత్తవారికి నటించే అవకాశం ఇస్తున్నాం' అని దర్శకుడు వివేక్ పోతిగేని చెప్పారు.
నిర్మాత ఉపేన్ నడిపల్లి మాట్లాడుతూ, 'యదార్థ సంఘటనల ఆధారంగా సినిమా తీద్దాం అని దర్శకుడు వివేక్ చెప్పడంతో ఈ సినిమాను తనతో కలిసి నిర్మిస్తున్నాను. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఆలోచింప జేసేలా ఉంటుంది' అని చెప్పారు.