Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను కర్నూల్లో చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ, 'దర్శకుడు వేణు ఊడుగుల తన జీవిత కాలంలో చూసిన సంఘటనలతో 'విరాటపర్వం' అనే అద్భుతమైన సినిమా చేశారు. 'చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవడు.. సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్నినాళ్లు..' ఇలా నేను ఈ చిత్రంలో గొప్ప కవిత్వం చెప్పుకుంటూ వెళితే, సాయి పల్లవి గారు వెన్నెల అనే అద్భుతమైన పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో హీరో సాయి పల్లవి. ఇది వెన్నెల కథ' అని అన్నారు.
'మా ట్రైలర్ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. 'విరాటపర్వం' లాంటి కథ రావడం చాలా గర్వంగా ఉంది. అన్ని బలమైన పాత్రలతో ఒక ప్రాంతానికి సంబంధించిన బలమైన కథ చెప్పాలంటే బలమైన రచయిత కావాలి. అలాంటి బలమైన రచయిత వేణు ఊడుగుల గారి రూపంలో వచ్చారు. తెలంగాణ, భాష, ఊరు గురించి అద్భుతంగా చూపించారు. ఇలాంటి గొప్ప కథలో నాకు అవకాశం కల్పించినందుకు దర్శక, నిర్మాతలకు కతజ్ఞతలు' అని నాయిక సాయిపల్లవి చెప్పారు. దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ, '1990లలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన అద్భుతమైన ప్రేమకథా చిత్రం 'విరాటపర్వం'. ఈనెల 17న వస్తున్న మా చిత్రాన్ని మీరంతా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. 'ఇంత వర్షం, గాలుల్లో కూడా గొప్పగా సహకరించిన కర్నూలు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. కచ్చితంగా అందర్నీ మెప్పించే సినిమా అని నమ్మకంతో ఉన్నాం' అని నిర్మాత సుధాకర్ చెరుకూరి చెప్పారు.
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ, 'ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా కాబోతుంది. రానా, సాయి పల్లవి గారితో కలసి నటించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు ఊడుగులకి, నిర్మాతలకు కతజ్ఞతలు. ఇది ఎప్పటికీ నిలిచిపోయే సినిమా. ఈనెల 17న ప్రేక్షకులంతా థియేటర్లో సినిమా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు.