Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'విరాటపర్వం'. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈనెల 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు వేణు ఊడుగుల బుధవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
నేను పుట్టి పెరిగిన వాతావరణం, చూసిన జీవితం, చదివిన పుస్తకాలు.. నేను ఎలాంటి సినిమా తీయాలో అనే ఒక విజన్‌ని ఇచ్చాయి. నాకు తెలిసిన జీవితాన్ని చెప్పాలని, చరిత్రలో దాగిన కథలు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా తీసిన సినిమానే 'విరాటపర్వం'. ఈ చిత్రకథతోపాటు ఇందులోని వెన్నెల పాత్రకు ప్రేరణ ఉంది. యదార్ధ సంఘటనలు ఆధారంగానే ఈ చిత్రాన్ని తీశాం. సరళ అనే ఒక అమ్మాయి జీవితం ఇది.
చరిత్రలో దాగి ఉన్న ఒక అందమైన ప్రేమకథ చెబుతున్నాం. 'విరాటపర్వం' ఒక అమ్మాయి ప్రేమకథ. నక్సల్ నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది. చాలా కొత్తగా ఉండబోతుంది. ఇలాంటి కథని హీరో రానాకి చెప్పి ఎలా ఒప్పించారు అని చాలా మంది అడిగారు. రానా గారు ఈ కథ అంగీకరించడం నా గొప్పతనం కాదు ఆయనదే. అయితే ఈ కథ రానా గారు ఎందుకు చేస్తానన్నారో కాసేపు అర్థం కాలేదు. ఒక కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథతో వచ్చాడు. ఇలాంటి సినిమా మనం చేయకపోతే ఎవరు చేస్తారనే గొప్ప మనసుతో రానాగారు ఈ సినిమాని చేశారని తర్వాత తెలుసుకోగలిగాను.
ఈ కథని రాసుకున్నప్పుడు వెన్నెల పాత్రలో నా మనసులో మెదిలింది సాయిపల్లవిగారే. ఈ కథని ఆమెకి ఓ పది నిమిషాల్లో చెప్పాను. వెంటనే గ్రీన్‌సిగల్ ఇచ్చారు. సురేష్‌బాబు, రానా, సాయిపల్లవి..ఇలా కథ విన్న ప్రతి ఒక్కరూ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఈ కథలోనే అంత గొప్ప వైబ్రేషన్ ఉంది. రానా, సాయిపల్లవి, నవీన్‌చంద్ర, నందితదాస్, జారినా వహాబ్..లాంటి హేమాహేమీలు నేను అనుకున్న కథకి నూటికి నూరుశాతం న్యాయం చేశారు.
1990 నేపథ్యంలో కావడంతో సినిమాని చాలా సహజంగా తీయాలని రిమోట్ ఏరియాల్లో షూటింగ్ చేశాం. మేకింగ్ పరంగా మా టీమ్‌తోపాటు నిర్మాతలు సైతం రెండు సినిమాలకు పడాల్సిన కష్టాన్ని పడ్డారు.
1992లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వెనుక రాజకీయ కారణాలు ఉండటం వలన ఈ కథని జనాలకి చెప్పాలని ప్రేరణ పొందా. అయితే సినిమా అన్నప్పుడు కొంత ఫిక్షన్ ఉంటుంది. కథని సినిమాగా మార్చుకున్నపుడు కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమానే తప్ప ఇది బయోపిక్ కాదు.ఈ సినిమా ముగింపు ఏమిటనేది ఇప్పుడే చెప్పను. అయితే ఆ ముగింపు ప్రేక్షకుడిపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందనేది మాత్రం చెప్పగలను.
భవిష్యత్‌లోనూ ఇలాంటి అర్థవంతమైన సినిమాలు చేయాలనేది నా తపన. 'మైదానం' ప్రాజెక్ట్ ఆహా కోసం చేస్తున్నాం. ఇది చలంగారు రాసిన నవలకి మనదైన వ్యాఖ్యానంతో ఉంటుంది. దీనికి షో రన్నర్‌గా చేస్తున్నా.