Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయితలుగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న పరుచూరి బద్రర్స్ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా పరుచూరి సుదర్శన్ (పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు)హీరోగా ఇండిస్టీకి పరిచయం అవుతున్నారు. 'సిద్ధాపూర్ అగ్రహారం' అనే టైటిల్ ఖరారు చేసుకున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వాసు తిరుమల, ఉష శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శ్రీపాద దర్శకుడు.
హీరో పరుచూరి సుదర్శన్‌పై అగ్ర దర్శకులు బి.గోపాల్ క్లాప్ ఇవ్వగా, వి.వి.వినాయక్ కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. పరుచూరి గోపాలకష్ణ స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందజేశారు. దర్శకులు వి.ఎన్.ఆదిత్య, వీరూ పొట్ల ముఖ్య అతిథులుగా విచ్చేసి, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకష్ణ మాట్లాడుతూ,'నా మనవడు సుదర్శన్ హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సుదర్శన్‌కు యాక్టర్‌గా మంచి జీవితాన్ని ప్రసాదించాలి' అని చెప్పారు. 'నేను హీరో అవుదామని అనుకోలేదు. కానీ దర్శకుడు కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. యాక్టర్‌గా మంచి సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాను' అని హీరో సుదర్శన్ అన్నారు. దర్శకుడు రాకేష్ మాట్లాడుతూ,'పరుచూరి బ్రదర్స్ నాకు ఎంతో స్ఫూర్తి. ఈ సినిమా హిట్ అవుతుంది' అని తెలిపారు.
'మా బ్యానర్లో రూపొందుతోన్న రెండో సినిమా ఇది. సుదర్శన్‌ను మా బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నందుకు లక్కీగా ఫీల్ అవుతున్నాం. దర్శకుడు రాకేష్ మంచి కథ రెడీ చేశారు. సమష్టి కృషితో సినిమా మంచి ఫలితం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని నిర్మాతలు వాసు తిరుమల, ఉష శివకుమార్ అన్నారు.