Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'విరాటపర్వం'. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా ఈనెల17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపథ్యంలో హీరో రానా శనివారం మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
లోతైన ప్రేమకథ
నా కెరీర్లో ఫస్ట్ టైం ఒక గ్రేట్ లవ్ స్టొరీ చేశాను. చాలా లోతైన ప్రేమకథ. ప్రేమ కోసం ఒక వ్యక్తి ఎంత దూరం వెళ్తాడు?, ఎంత త్యాగం చేస్తాడు అనే దాన్ని మా దర్శకుడు అత్యద్భుతంగా సిల్వర్‌స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. ఒక లోతైన సముద్రంలో తోసేస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో, ఈ 'విరాటపర్వం' కథ చదివినప్పుడు అలాంటి డీప్ ఫీలింగ్ కలిగింది. ఇందులో రవన్నగా నటించా. దళం సభ్యుడిగా ఓ ఖచ్చితమైన లక్ష్యంతో ఉంటాను. కుటుంబం, స్నేహ బంధాల కన్నా సమాజమే ముఖ్యమని జీవిస్తాను. ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేకుండా వెళ్తున్న నా జీవితంలోకి వెన్నెల (సాయి పల్లవి) ప్రవేశిస్తుంది. ఇక్కడే ఒక మోరల్ డైలమా ఉంటుంది. లక్ష్యం కోసం పని చేయాలా? లేక ఫ్యామిలీతో కలిసిపోయి రిలాక్స్ అవ్వాలా? అనేది ఒక మోరల్ డైలమా. ఈ సినిమా ఈ మోరల్ డైలమా గురించి ఏం చెప్పింది అనేది ఆద్యంతం ఆసక్తికరం.
అలాంటి అజ్ఞాత పోరాటం..
బేసిగ్గా రవన్న ఒక డాక్టర్. కానీ అప్పుడున్న పరిస్థితులు రవన్నని కవిగా తర్వాత ఉద్యమ నాయకుడిగా మారుస్తాయి ఈ సినిమా టైటిల్ జస్టిఫికేషన్ గురించి చెప్పాలంటే, మహాభారతంలో విరాటపర్వం అనేది అజ్ఞాత వాసానికి సంబంధించిన కథ. ఈ 'విరాట పర్వం'లోనూ అలాంటి అజ్ఞాత పోరాటం ఉంటుంది.
సాయిపల్లవి మాత్రమే..
ఈ సినిమాలో సాయిపల్లవితో పాటు జరీనా వాహెబ్, ప్రియమణి, ఈశ్వరి రావు, నందిత దాస్ పాత్రలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ప్రధాన పాత్రలే కాకుండా మిగతా పాత్రలు చెప్పే డైలాగ్స్, ఆలోచనలతో కూడా కథ వేగంగా ముందుకు వెళ్తుంది. సాయి పల్లవి గొప్ప నటి. వెన్నెల పాత్రలో మరో స్థాయిలో ఆమె నటన ఉంటుంది. ఇది వెన్నెల కథ అని ట్రైలర్లో చెప్పాం. రవన్న పాత్రని మరొకరు చేస్తారో లేదో తెలీదు కానీ వెన్నెల పాత్రని సాయి పల్లవి తప్పితే మరొకరు చేయలేరు. 'విరాట పర్వం' ప్రివ్యూలకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మొదటిసారి ఓ పాట పాడాను.
కథలో నిజాయితీ ఉంటే నిర్మిస్తా..
ఈ సినిమాకి ఒక నిర్మాతగా ఉన్నాను. ఇకపై కూడా నిజాయితీ గల సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. 'బొమ్మలాట', 'కేరాఫ్ కంచరపాలెం', 'చార్లీ'.. ఇప్పుడు విరాటపర్వంకు నిర్మాతగా నా పేరు కనిపిస్తుంది. నేను, వెంకటేష్‌గారు చేసిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. క్రైమ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. ఇకపై నా నుంచి రాబోతున్న సినిమాలన్ని చాలా కొత్తగా ఉంటాయి.