Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'విరాటపర్వం'. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో నాయిక సాయి పల్లవి మంగళవారం మీడియాతో ముచ్చటించారు.
ఈ సినిమా సరళగారి జీవితం స్ఫూర్తిగా రూపొందింది. సరళగారి కుటుంబాన్ని కలవడం చాలా ఎమోషనల్ మూమెంట్. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఆమె నన్ను దీవించి, చీర కానుకగా ఇచ్చారు.
దర్శకుడు వేణు ఊడుగుల కథ చెప్పినపుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్న భావన కలిగింది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తే నటిగా మరింత మెరుగౌతాను. నన్ను నేను సవాల్ చేసుకున్నట్లు ఉంటుందని ఈ సినిమా చేశాను. ముఖ్యంగా నేను పోషించిన వెన్నెల పాత్రలో రానెస్ ఉంది. ఇసుకతో బొమ్మ తయారు చేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఆయుధంగా కూడా మలుచుకోవచ్చు. వెన్నెల పాత్ర కూడా అలానే అనిపించింది. వెన్నెల ఒక తెల్లకాగితం. దానిపై ఏది రాస్తే అదే ఆమె అవుతుంది. దర్శకుడు ఆ పాత్రని చాలా నిజాయితీగా రాశారు.
నక్సలిజం నేపథ్యంలో వస్తున్న ప్రేమకథ ఇది. ఇదొక అద్భుత ప్రయాణం. వెన్నెల పాత్రలో ఒక అమాయకత్వం ఉంటుంది. తను నమ్మేదాన్ని సాధించే తెగువా ఉంటుంది. ఆ పాత్రలో ఉన్న ఆ స్పిరిట్ నాకు బాగా నచ్చింది.
రానాగారి లాంటి స్టార్ ఉన్నప్పటికీ ఈ సినిమా వెన్నెల కథే చెప్పటం వారి సంస్కారానికి నిదర్శనం. రానాగారి స్టార్ డమ్, స్థాయి, ఆయనకి ఉన్న వాయిస్‌కి రవన్న పాత్ర ఆయనకి గొప్పగా నప్పింది. ఆయన వచ్చిన తర్వాత ఈ సినిమా స్కేల్ మారిపోయింది. ఆయన ఈ ప్రాజెక్ట్ చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ప్రియమణి, నందితా దాస్ లాంటి వారితో పని చేయడాన్ని ప్రేరణగా భావిస్తాను.
దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్‌గారు ఈ సినిమా ప్రీమియర్ చూసి, రానాగారితో బాగా నచ్చిందని చెప్పటం హ్యాపీగా అనిపించింది. దర్శకుడు వేణు ఉడుగుల గొప్ప రచయిత. ఆయనతో పని చేయటం సరికొత్త అనుభూతినిచ్చింది. ప్రస్తుతం శివకార్తికేయన్ గారితో తమిళంలో ఒక సినిమాకి సైన్ చేశాను. ఇమేజ్ గురించి నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడమే నా పని.