Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'విరాటపర్వం'. 1990లో సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బందం నిర్వహించిన మీడియా సమావేశంలో సరళ అన్నయ్య తూము మోహన్‌రావు కూడా పాల్గొన్నారు.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, 'మా సురేష్ ప్రొడక్షన్లో తొలిసారి యదార్థ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రమిది. దర్శకుడు వేణు కథని అద్భుతంగా తెరకెక్కించారు. సాయి పల్లవి గొప్పగా నటించింది. ఈ సినిమా విజయంతో మేం కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తప్తినిచ్చింది' అని అన్నారు. 'సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. మోహన్‌రావు గారు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా' అని సాయి పల్లవి చెప్పారు.
దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ,' ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుండి యునానిమస్‌గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సాయి పల్లవి లేకపోతే ఈ కథ ఉండేది కాదు' అని తెలిపారు. తూము మోహన్‌రావు మాట్లాడుతూ, '30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. వేణుగారు కొన్ని నెలలు క్రితం నన్ను కలిసి, ఈ సినిమా గురించి చెప్పారు. సినిమా చూసిన తర్వాత మేం ఏం అనుకుంటున్నామో అదే తీశారు. సాయిపల్లవిగారు వెన్నెలగా జీవించారు. అందరూ చూడాల్సిన చిత్రమిది' అని అన్నారు.