Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేఎస్ఐ సినిమా అన్లిమిలెట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మిస్తున్న చిత్రం 'యానం'. షేక్స్పియర్ రచనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా కరుణాకరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రంలోని హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లను శనివారం ప్రసాద్ ల్యాబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత శరత్ మరార్, యువ హీరో లక్ష్ చదలవాడ సంయుక్తంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ, 'నేను నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమాలో క్రిష్ పాత్రలో హీరో కళ్యాణ్, మాహీ పాత్రలో హీరోయిన్ రేణుశ్రీ నటిస్తున్నారు. వీరితో పాటు మరికొంత మంది ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలలో నటించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ కథ తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని అన్నారు. 'శ్రీకాంత్ అయ్యంగార్ మా బ్యానర్లో చాలా సినిమాల్లో నటించారు. అన్ని రకాల పాత్రలు పోషించగల మంచి నటుడు. ఆయన నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను' అని నిర్మాత శరత్ మరార్ తెలిపారు.
హీరో లక్ష్ చదలవాడ మాట్లాడుతూ, 'మా 'గ్యాంగ్స్టర్ గంగరాజు' సినిమా మొదలైనప్పటి నుండి శ్రీకాంత్ గారితో పరిచయం ఏర్పడింది. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆ సినిమాకు హైలెట్ అవుతాయి. ఆయన నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అందర్నీ అలరించాలి' అని చెప్పారు.